ఐ ప్రామిస్ టు పే ద బేరర్....

20:44 - November 30, 2016

ఈ వాక్యం ఎక్కడైనా చదివినట్టు గుర్తొస్తోందా.. మీ జేబులో ఉన్న ప్రతి నోటుపైనా ఉంటుంది. కొత్త నోటుపైనే కాదు.. సర్కారు చెల్లవని చెప్పిన అయిదొందలు, వెయ్యి నోట్లపై కూడా.. మరి ఆ ప్రామిస్ ఏమయింది. ఒట్టు తీసి గట్టున పెట్టారా? ప్రజలకు భరోసానిచ్చే ఆర్బీఐ ప్రామిస్ ఎలా గాల్లో కలిసింది? బ్యాంకులంటే ప్రజలకు మధ్య ఉండాల్సిన నమ్మకం ఎందుకు పోతోంది? దీనికి కారణం బ్యాంకులా? ఆర్బీఐనా? లేక ప్రభుత్వమా? ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. నోటూ నోటూ ఎందుకు చెల్లవంటే తెల్లమొహం వేసింది. ఏటీఏం ఏటీఎం సొమ్మెక్కడా అంటే బ్యాంకునడగమంది. . బ్యాంకూ బ్యాంకూ మా డబ్బులేమయ్యాయీ అంటే ఆర్బీఐని అడగమంది.. ఆర్బీఐ ఆర్బీఐ ఈ దేశంలో ఏం జరుగుతోందీ అంటే.. నాకేం తెలుసు సర్కారుని అడగమంటోంది.. బ్యాంకంటే ఓ భరోసా..బ్యాంకంటే ఓ నమ్మకం..బ్యాంకంటే ఓ బలం.. బ్యాకంటే ఓ వెలకట్టలేని ఆసరా.. కానీ, ఇప్పుడా బ్యాంకు వెక్కిరిస్తోంది. నా చేతుల్లోనూ ఏం లేదని వట్టి చేతులు చూపిస్తోంది. ఐ ప్రామిస్డ్ టు పే అని ఓ ప్రామిస్ చేశారు.. అదే మన ఆర్ధిక వ్యవస్థకు.. చలామణీలో ఉన్న సొమ్ముకు ఓ నమ్మకం.. అదే దేశంలో ప్రతి అమ్మకానికి కొనుగోలుకు..సొమ్ముతో ముడిపడిన ప్రతి వ్యవహారానికి ఓ గ్యారంటీ.. కానీ, ఇప్పుడా గ్యారంటీ ఒక్కసారిగా వమ్మయింది. దీనికి ఆర్బీఐని ప్రశ్నించాలా? లేక సర్కారుని నిలదీయాలా? ఇక్కడ నమ్మకం కోల్పోయిందెవరు? ఆఖరికి కొత్త నోట్లు కూడా నమ్మకంగా కనిపించని పరిస్థితి ఏర్పడిందా? చిన్న బ్రేక్ తర్వాత..ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోంది..కరెన్సీ నోటుపై చేసిన వాగ్దానాలు తుంగలో తొక్కారు..పూటకో కొత్త మాటతో రిజర్వ్ బ్యాంకు తమాషా చేస్తోంది. బ్యాంకులను కస్టమర్లకు మధ్య ఉన్న నమ్మకం సడలుతోంది. ఇవన్నీ ఆలా ఉంచితే,ఆఖరికి కొత్త నోట్లు కూడా నమ్మకంగా కనిపించని పరిస్థితి ఏర్పడిందా? ఓ పక్క కరెంటులేని గ్రామాలున్నాయి.. ఇంటర్నెట్ లేని ప్రజలు మెజారిటీలో ఉన్నారు. అసలు టెక్నాలజీని ఉపయోగించలేని వారు నూటికి తొంభైమంది ఉన్నారు.. కానీ, క్యాష్ లెస్ ప్రజలున్న దేశాన్ని క్యాష్ లెస్ ఎకానమీగా మారుస్తామంటున్నారు.. ఇది ఎప్పటికి సాధ్యం..? ఈ లోగా ఎన్ని సమస్యలు వస్తాయి? ప్రజల అవసరాలనుబట్టి సర్కారు నిర్ణయాలుండాలి. ప్రజల డిమాండ్లను బట్టి సర్కారు చర్యలుండాలి. కానీ, రాజకీయ ప్రయోజనాలకోసమో, లేక మరేదో లాభాల కోసమో నిర్ణయాలు తీసుకుంటే అంతిమంగా దేశానికి ప్రయోజనం మాట అటుంచి, కోలుకోలేని నష్టానికి కారణం అవటం మాత్రం ఖాయం.. నోట్ల రద్దుతో దేశంలో మెజారిటీ ప్రజలను నానా పాట్లకు గురిచేయటం ఇంతకంటే భిన్నంగా ఉండబోదు.. నమ్మకాన్ని పెంపొందించకుండా, భరోసాని తగ్గించే నిర్ణయాలు ప్రజాస్వామ్య దేశానికి ఏ మాత్రం క్షేమకరం కాదు.

Don't Miss