కుల్‌భూషణ్‌ జాదవ్‌ ఉరిశిక్షపై స్టే

21:27 - May 18, 2017

హైదరాబాద్: అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్‌కు గొప్ప ఊరట లభించింది. పాకిస్తాన్‌ ఆర్మీకోర్టు విధించిన ఉరిశిక్షపై ఐసిజె స్టే విధించింది. గూఢచర్యం ఆరోపణలపై కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్‌ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించడంపై అంతర్జాతీయ న్యాయస్థానంలోని 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం సమీక్షించింది. ఈ కేసు ఐసిజే పరిధిలోకి రాదన్న పాక్‌ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. జాదవ్ కేసును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉందని స్పష్టం చేసింది. తుది తీర్పు వెలువడే వరకు జాదవ్‌ను ఉరితీయమని పాకిస్తాన్‌ హామీ ఇవ్వాలని ఐసిజే ఆదేశించింది.

భారత్‌ డిమాండ్‌ సరైనదేనని...

జాదవ్‌ ఉరిశిక్షపై స్టే విధించాలన్న భారత్‌ డిమాండ్‌ సరైనదేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఆగస్టు వరకు జాదవ్‌కు ఉరిశిక్ష విధించమని పాకిస్తాన్‌ చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్‌ను కలుసుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసింది. జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 15న ఐసిజే విచారణ చేపట్టింది. భారత్‌, పాకిస్తాన్‌లు తమ తమ వాదనలు వినిపించాయి. జాదవ్‌ను ఇరాన్‌లో కిడ్నాప్‌ చేసి రహస్యంగా పాకిస్తాన్‌కు తీసుకెళ్లి గూఢచర్యానికి పాల్పడ్డట్లు ముద్రవేసిందని భారత్‌ పేర్కొంది... ఎలాంటి ఆధారాలు చూపకుండానే జాదవ్‌కు ఉరిశిక్ష విధించిందని భారత్‌ వాదించింది. పాకిస్తాన్‌ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టుకు తెలిపింది

భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోదని...

జాదవ్‌ విషయంలో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోదని పాకిస్తాన్‌ ఆరోపించింది. జాదవ్‌ ఇరాన్‌ నుంచి పాకిస్తాన్‌లోకి చొరబడి గూఢచర్యానికి పాల్పడ్డారని... ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. గూఢాచారులకు అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని పాకిస్తాన్‌ ప్రతివాదన చేసింది. ఈ కేసులో భారత్‌ తరఫున హరీశ్‌ సాల్వే, పాక్‌ తరఫున అస్తర్‌ అలీ వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్ సాల్వే నామమాత్రంగా ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకున్నారు.

పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ...

అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 18 ఏళ్ల తర్వాత మరోసారి పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. 1999లో పాకిస్తాన్‌ యుద్ధ విమానాన్ని కుచ్‌ ప్రాంతంలో భారత్‌ కూల్చివేసింది. ఈ ఘటనలో 16 మంది సిబ్బంది మృతి చెందారు. తమ గగనతలంలో ఉండగా భారత్‌ అక్రమంగా విమానాన్ని కూల్చివేసిందని... భారీ నష్ట పరిహారం కోరుతూ పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పాక్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 14-2 తేడాతో కొట్టివేసింది. ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదన్న భారత్‌ వాదనను కోర్టు సమర్థించింది.

Don't Miss