ఐపీఎల్ 11..ముచ్చటగా మూడోసారి...

06:51 - May 28, 2018

ఢిల్లీ : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చమక్కుమంది. రెండేండ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగిన చెన్నై... తమ పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. మిగతా జట్లకు సాధ్యం కాని రీతిలో ఏడోసారి ఫైనల్ చేరిన ధోనీసేన కప్‌తో తమ కలను సాకారం చేసుకుంది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై.... ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది. రెండేళ్ల నిరీక్షణ... స్పాట్‌ ఫిక్సింగ్‌తో మంటకలిసిన పరువు.. అపప్రదల మధ్య ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌... సంచలనం సృష్టించింది. చేజారిపోయిన చరిత్రకు తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తూ రికార్డుల రారాజులమనే పేరును సార్థకం చేసుకుంటూ వాంఖడేలో పరుగుల తుఫాన్‌ సృష్టించింది. లక్ష్యం పెద్దతే అయినా.. ఓటమి భయం వెంటాడినా...ఫేవరెట్‌ హోదాకు న్యాయం చేస్తూ మాజీ చాంపియన్‌గా తన అనుభవాన్ని రంగరించి టైటిల్‌ను ఎగరేసుకు పోయింది. చెన్నై అభిమానుల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ మహేంద్రుడు ఆడిన మహాన్నాటకంలో ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌-11 సీజన్‌ విజేతగా నిలిచింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై కేవలం 18.3 ఓవర్లలోనే అందుకుంది. ఓపెనర్‌ వాట్సన్‌ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. 57 బంతులు ఎదుర్కొన్న వాట్సన్‌.. 11పోర్లు, 8 సిక్స్‌లతో 117 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. వాట్సన్‌ విజృంభణతో హైదరాబాద్‌ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై.. 16 పరుగుల వద్ద డుప్లెసిస్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో వాట్సన్‌ - రైనాల జోడి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించింది. పవర్‌ ప్లే వరకు ఆచితూచి ఆడిన వీరిద్దరు ఆ తర్వాత రెచ్చిపోయారు. వాట్సన్‌ బౌండరీలే లక్ష్యంగా విరుచుకు పడ్డాడు. 33 బంతుల్లో హాప్‌సెంచరీ సాధించిన వాట్సన్‌.. ఆపై మరో 18 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సందీప్‌శర్మ వేసిన 13వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, రెండు పోర్లతో 27 పరుగులు రాబట్టాడు. దీంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇదే ఊపును కొనసాగించిన వాట్సన్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతుకుముందు సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. విలియమ్సన్‌ 36 బంతుల్లో 5 పోర్లు, 2 సిక్సర్లతో 47 రన్స్‌ చేశాడు. శిఖర్‌ ధావన్‌ 25 బంతుల్లో 26రన్స్‌ సాధించాడు. షకీబుల్‌ హసన్‌ ఫర్వాలేదని పించాడు. చివర్లో యూసఫ్‌ పఠాన్‌ 25 బాల్స్‌ ఎదుర్కొని 45 రన్స్‌ చేశాడు. బ్రాత్‌వైట్‌ కూడా 11 బంతుల్లో 21 రన్స్‌ చేయడంతో హైదరాబాద్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

Don't Miss