ఐపీఎల్‌ లో కోల్‌కతా సూపర్‌ విక్టరీ

08:25 - May 4, 2018

కోల్ కతా : ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అదరగొట్టారు. ఈడెన్‌గార్డెన్స్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను చిత్తుచేశారు.  గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో  ఆరు వికెట్ల తేడాతో  కోల్‌కతా సూపర్‌ విక్టరీ కొట్టింది. టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నైఇన్నింగ్స్‌ను షేన్‌ వాట్సన్‌, డు ప్లెసిస్‌లు ధాటిగా ఆరంభించారు. డుప్లెసిస్‌ 27పరుగులు చేసి పెవిలియన్‌ చేరగా..  ఆ తర్వాత వాట్సన్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 36 పరుగులు చేసిన వాట్సన్‌  రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక రైనా 26 బంతుల్లో 4 ఫోర్లలతో  31 రన్స్‌ చేశాడు. తర్వాత  అంబటి రాయుడు 21,  జడేజా 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఇక ఆరో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్‌ధోని  బ్యాట్‌తో మెరుపులు మెరిపిచాడు. 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లు బాదేసి 43రన్స్‌తో నాటౌట్గా నిలిచాడు. దీంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. తర్వాత 178 పరగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా  17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మాన్‌ గిల్‌ 57, దినేశ్‌ కార్తీక్‌ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.  కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌, పీయూష్‌ చావ్లాలు తలో రెండు వికెట్లు సాధించగా, కుల్దీప్‌ యాదవ్‌కు ఒకవికెట్‌ దక్కింది. 

 

Don't Miss