'దుర్గగడి' ప్రక్షాళన...

14:14 - August 10, 2018

విజయవాడ : ప్రముఖ పుణ్యక్షేత్రం 'విజయవాడ దుర్గగుడి'..లో ఎన్నో వివాదాలు..వరుస వివాదాలతో చెడ్డ పేరు వస్తుండడంతో ప్రభుత్వం ప్రక్షాళనకు నడుం బిగించింది. దుర్గగుడి ఈవో పద్మ కుమారిని ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణకార్పొరేషన్ ఎండీగా పద్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు పద్మ స్థానంలో దుర్గగుడి ఈవోగా ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మను నియమించారు. దేవాదాయశాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పద్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

దుర్గగుడిలో గతంలో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ఆషాడ మాసం సందర్భంగా కొంతమంది భక్తులు అమ్మవారికి చీర సమర్పించారు. కొద్దిసేపటికే ఈ చీర మాయం కావడం కలకలం రేపింది. పోలీసులు, పాలక మండలి ఛైర్మన్ ఘటనపై నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారు. దీనితో గురువారం రాత్రి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రాథమిక దర్యాప్తులో చీరను పాలకమండలి సభ్యురాలు సూర్య లతకుమారి తీసుకువెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో గత రాత్రి దుర్గగుడి పాలకమండలి సభ్యురాలుగా సూర్య లతకుమారిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

శుక్రవారం పాలక మండిలితో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న భేటీ అయ్యారు. పాలక మండలి వ్యవహరిస్తున్న తీరుతో చెడ్డ పేరు వస్తోందని బుద్ధా వెంకన్న అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 

Don't Miss