ఇస్రో..ఒకేసారి 104 ఉపగ్రహాలు..
ఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగనతలంలో మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. ఇప్పటి వరకు అనేక రికార్డులు సృష్టించిన ఇస్రో... మరో రికార్డు ప్రయోగానికి సిద్దమైంది. ఈనెల 15న ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నద్దమైంది. దీని ద్వారా రష్యా రికార్డును ఇస్రో బద్దలు కొట్టబోతోంది. వరుస విజయాలతో జోరుమీదున్న ఇస్రో మరో రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అనేక ప్రతిష్టాత్మక ప్రయోగాలతో దేశఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన షార్.. ఇప్పుడు ప్రపంచానికే సవాల్ విసరబోతోంది. మంగళయాన్, చంద్రయాన్-1లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విజయవంతం చేసిన ఆత్మవిశ్వాసంతో ఈ ఏడాది సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది. ఈనెల 15న... మరో భారీ ప్రయోగానికి ఇస్రో సన్నద్దమైంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతోంది. ఒకేసారి 37 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రష్యా రికార్డును.. భారత్ బద్దలు కొట్టనుంది.
104 ఉపగ్రహాలు..
పీఎస్ఎల్వి -సి37 వాహన నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 15వ తేదీ ఉదయం 9.28కి ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు. ఈ రాకెట్లో పంపించే ఉపగ్రహాల్లో భారత్‌కు చెందినవి కేవలం మూడే. మిగిలిన 101 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవే. మన దేశానికి చెందిన 714 కిలోల బరువుగల కార్టోశాట్ 2డి ప్రధాన ఉపగ్రహం, 20కిలోల బరువు ఐఎన్ఎస్ -1ఏ, ఐఎన్ఎస్ -1బి నానో ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. వీటిలో అమెరికా, ఇజ్రాయిల్, కజకిస్తాన్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ ముందుకు రావడంతో 101 ఉపగ్రహాలను గగనతలంలోకి పంపనున్నారు.
గంటన్నర పాటు ప్రయోగం..
ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని గంటన్నరపాటు జరుపనుంది. 104 ఉపగ్రహాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన తర్వాత భూమికి 500 కిలోమీటర్ల దూరంలో ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్‌ను విడవనుంది. అనంతరం అక్కడి నుంచి 630 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మిగిలిన 101 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేరేవిధంగా శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నందున ఒక్కొక్క బాక్స్‌లో 25 ఉపగ్రహాలు పెట్టి మొత్తం నాలుగు పెట్టెల్లో అమర్చి ఒకదాని తర్వాత ఒకటి విడిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది మొత్తం జరుగడానికి 90నిమిషాల సమయం పడుతుంది.
చివరి క్షణంలో మార్పులు..చేర్పులు..
భూగోళ పరిశోధనల కోసం ఇస్రో ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. గత ఏడాది జూన్ 22న ఒకే రాకెట్లో 20 ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ తన సత్తా చాటింది. అయితే రష్యా మాత్రం 2014లోనే ఏకకాలంలో 37 ఉపగ్రహాలను ప్రయోగించడం ఇప్పటి వరకు అతిపెద్ద రికార్డు. ఇప్పుడు 104 ఉపగ్రహాలను పంపి భారత్ ఈ రికార్డును బద్దలు కొట్టబోతోంది. ఈ ప్రయోడానికి 48 గంటల ముందే కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి చివరి క్షణంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.