చరిత్ర సృష్టించిన ఇస్రో

16:47 - February 15, 2017

నెల్లూరు : అంతరిక్ష పరిశోధనల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో...మరో మైలు రాయిని దాటింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్ష చరిత్రలో భారత్‌ కీర్తిపతాక  రెపరెపలాడేలా చేసింది. పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ సరికొత్త ప్రయోగంతో అగ్రదేశాలను భారత్‌ అధిగమించింది. 
ఒక్క రాకెట్టుతో 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి 
భారత్‌ అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరోసారి తన సత్తాను చాటింది. ఒక్క రాకెట్టుతో 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి చ‌రిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ రీసెర్చ్‌  సెంటర్ నుంచి ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి అగ్ర దేశాలకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ  కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 
నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్ ఎల్ వీ సీ37రాకెట్‌ 
అన్ని దశల‍్లోనూ పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. నాల‍్గవ దశలో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతూ రాకెట్‌ పయనించింది. మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్షలోకి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. 17.31 నిమిషాలకు కార్టోశాట్‌-2 ఉపగ్రహాన్ని.. ఆ తర్వాత  ఐఎన్‌ఎస్‌-1ఎ, ఐఎన్‌ఎస్‌-1బి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, ఇజ్రాయెల్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యూఏఈ  దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించాయి. 28.42 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. వీటికి సంబంధించి మారిషస్‌లోని ఇస్రో కేంద్రానికి తొలి సంకేతాలు  అందాయి.
భారత్‌కు చెందిన 3 ఉపగ్రహాలు 
భారత్‌కు చెందిన మూడు ఉపగ్రహాల్లో కార్బోశాట్‌ 2.....714 కేజీలు కాగా.. ఐఎన్‌ఎస్‌ 1 ఏ, ఐఎన్‌ఎస్‌ 1 బి ఉపగ్రహాలు ఒక్కొక్కటి 15 కేజీల బరువు ఉన్నాయి. మిగతా దేశాలకు  చెందిన ఉపగ్రహాల బరువు 834 కిలోలు. కార్టోశాట్‌-2డి అత్యాధునిక కెమెరాలతో భూమికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని అందించనుంది.
ఆనందంలో ఇస్రో శాస్త్రవేత్తలు 
పీఎస్‌ఎల్‌వీ-సీ37 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. షార్‌ కేంద్రంలో ప్రయోగాన్ని ఉత్కంఠగా వీక్షించిన శాస్త్రవేత్తలు... ప్రయోగం ముగిసిన  వెంటనే ఒకరికి ఒకరు అభినందలు తెలుపుకున్నారు. ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. 
ఇస్రోకు ప్రశంసల వెల్లువ 
పీఎస్‌ఎల్‌వీ-సీ37 ప్రయోగం విజయవంతమవడంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించిన  ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రయోగం దేశానికి, మన అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వకారణమని కొనియాడారు. మన శాస్త్రవేత్తలకు దేశం సెల్యూట్‌ చేస్తోందని మోదీ ట్వీట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌ ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2013లో 29 ఉపగ్రహాలను...2014లో రష్యా ఏకంగా 39 ఉపగ్రహాలను పంపించి అగ్రస్థానాల్లో ఉండగా.. నేడు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ ఏకంగా 104 ఉపగ్రహాలను పంపించడంతో సరికొత‍్త రికార్డు సాధించింది. 

 

Don't Miss