ఇస్రో తిరుగులేని రికార్డు...

15:53 - January 12, 2018

ఢిల్లీ : శ్రీహరి కోటలో పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని రికార్డు సృష్టించింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి ఇస్రో వందో ఉపగ్రహాన్నిప్రయోగించి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. సరిగ్గా 9గంటల 29 నిముషాలకు పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్-2ఇ, ఒక నానో శాటిలైట్, ఒక సూక్ష్మ ఉపగ్రహంతో పాటు అమెరికా, బ్రిటన్ , రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, ఫిన్‌ల్యాండ్, కెనడాలకు చెందిన 28ఉపగ్రహాలు ఉన్నాయి. పీఎస్‌ఎల్వీ సీ-40 విజయవంతం కావడంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. అమెరికా, రష్యాల రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డును ఇస్రో సాధించింది. పీఎస్ఎల్వీ సీ-40 విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి ఇస్రో ఇచ్చిన కొత్త సంవత్సర కానుక అన్నారు ఇస్రో చైర్మన్ శివన్. అందరి సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు. 

Don't Miss