ఇస్రో అప్రతిహత విజయాలు..

17:09 - February 15, 2017

నెల్లూరు : గగనతంలో ఇస్రో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. పీఎస్‌ఎల్‌వీ -సీ37 విజయంతో సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర దేశాల సరసన భారత్‌ను నిలిపింది. ఇదే ఊపుతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఇస్రో భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రయోగాలపై 10టీవీ కథనం...
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త రికార్డు
ఇస్రో అంతరిక్షంలో విజయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆర్యభట్టతో తన ప్రయోగాల పరంపరను ప్రారంభించింది ఇస్రో. నాటి నుంచి నేటి వరకు ఎన్నో వాహన నౌకలను నింగిలోకిపంపి అప్రతిహత విజయాలను సాధించింది.  ఆర్ధిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను.. సాంకేతికంగా తిరుగులేని దేశంగా తీర్చిదిద్దే బాధ్యతను ఇస్రో తన భుజస్కందాల మీద వేసుకుంది.  ఆ ప్రయత్నంలోనే  అంతరిక్ష విజ్ఞానంలో అగ్రదేశాలకు ధీటుగా నిలబెట్టేందుకు అనేక ప్రయోగాలు చేపట్టింది. భవిష్యత్‌లోనూ మరిన్ని ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోంది. 
చంద్రయాన్‌ 2 ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో
చంద్రమండలంవైపు ఇస్రో అడుగులు పడ్డాయి. ఇప్పటికే చంద్రయాన్‌ 1 ప్రయోగాన్ని చేపట్టింది. ఆ పరిశోధనను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రయాన్‌ -2 ప్రయోగాన్ని ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది మొదట్లో గానీ చేపట్టే ఆలోచనలో ఉంది.
ఆదిత్య 1 ప్రాజెక్టుకు రెడీ అవుతోన్న ఇస్రో
సౌర వ్యవస్థ అధ్యయనం ఇప్పటికే ఇస్రో నింగిలోకి రాకెట్లను పంపింది. కానీ సూర్యుడికి అతి సమీపంలో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టలేకపోయింది. నాసా, ఈసాలు మాత్రమే సూర్యుడికి అతి సమీపంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టాయి. ఇదే వరుసలో నిలిచేందుకు ఇస్రో ఆదిత్య 1 ప్రాజెక్టు సిద్ధం అవుతోంది. 
అంగారక గ్రహంపై లోతైన అధ్యయనానికి ఇస్రో రెడీ
అంగారక గ్రహంపై లోతైన అధ్యయం చేయడానికి కూడా ఇస్రో రెడీ అయ్యింది. మంగళయాన్‌ -2 ద్వారా ఈ అధ్యయనం చేపట్టాలని నిర్ణయించింది. 2020 సంవత్సరాన్ని  ఇందుకు లక్ష్యం పెట్టుకుంది. ఇక పర్యావరణంలో వచ్చే మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌, సముద్ర నీటి మట్టాల్లో తేడాలు, గ్రీన్‌హౌస్‌ వాయువులు అధ్యయనానికి త్వరలోనే ఓ ఉపగ్రహం పంపించనుంది ఇస్రో.
నాసాతో కలిసి పనిచేయడానికి ఇస్రో రెడీ
అమెరికా అంతరిక్ష సంస్థ సానాతో కలిసి పనిచేయడానికి ఇస్రో సిద్ధమైంది. ఇస్రో, నాసా సంయుక్తంగా రాడార్‌ను అభివృద్ధి చేయనున్నాయి. భూకంపాలు, సునామీల వంటి ఉత్పాతాలను ఇది విశ్లేషించనుంది.  జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ -3ను పంపడానికి కూడా ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.  దీని ద్వారా నాలుగు టన్నులూ, అంతకంటే ఎక్కువ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపవచ్చు. ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్‌ ఇంజిన్‌ను వినియోగించనున్నారు. ఇదే కనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఖరీదైన వాహకనౌకలను తప్పించే అవకాశం ఉంది. హైత్రోపుట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా సమాచార , సాంకేతిక పరిజ్ఞానం మనకు మరింత చేరువకానుంది.
మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలకు ఏర్పాట్లు
ఇప్పటిదాకా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపిన అనుభవం ఇస్రోకు లేదు. ఆ లోటూ త్వరలోనే తీర్చనుంది ఇస్రో.  మానవసహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియా మొదలైపోయింది. ఇస్రో, భారత వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టుతో రష్యా, అమెరికా, చైనాల సరసన మనమూ చేరనున్నాం. 

Don't Miss