నేడు పీఎస్‌ఎల్‌వీ..సీ40 రాకెట్‌ ప్రోగం

07:04 - January 12, 2018

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. నేడు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ40ని నింగిలోకి పంపనుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంతో వంద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకోనుంది.
సర్వం సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తూ... భారత కీర్తి పతాకను నలుదిశగా వ్యాప్తి చేస్తోంది ఇస్రో. ఇప్పటికే అనేక  అనేక రాకెట్లను నింగిలోకి పంపి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ వేదికగా ఉదయం 9 గంటల 28 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ40 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు శాస్త్రవేత్తలు. కౌంట్‌డౌన్‌ కూడా నడుస్తోంది.
నింగిలోకి 30 ఉపగ్రహాలను పంపనున్న శాస్త్రవేత్తలు
పీఎస్‌ఎల్‌వీ సీ40 రాకెట్‌తో కార్టోశాట్‌-2 ఈఆర్‌ అనే ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో రెండు స్వదేశానికి చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు ఉండగా... అమెరికా, బ్రిటన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, ప్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, కెనడా దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తం 1323 కేజీల బరువును పీఎస్‌ఎల్‌వీ సీ40 రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కార్టోశాట్‌ సిరీస్‌ గురించే.  భూవాతావరణంలో స్థితిగతులను తెలుసుకునేందుకు 2007లో ఈ సిరీస్‌ను ప్రారంభించారు. భూవాతావరణాన్ని అధ్యయనం చేసే సిరీస్‌ల్లో కార్టోశాట్‌ సిరీస్‌ మూడోది. 710 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం భూమిపైన వాతావరణ స్థితిగతులు, సముద్రగర్భం, తుఫానులు తదితరాలను ముందుగా తెలుసుకునేలా స్పష్టమైన ఫోటోలను పంపిస్తుంది. దీంతో ఈ ప్రయోగంపై పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు శాస్త్రవేత్తలు. 
పీఎస్‌ఎల్‌వీ - సీ40తో మరో రికార్డు సృష్టించినున్న ఇస్రో
పీఎస్‌ఎల్‌వీ సీ40 ప్రయోగంతో ఇస్రో మరోమైలురాయి చేరుకోనుంది. ఇప్పటికే వాణిజ్యపరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతూ గెలుపు గుర్రంగామారిన  పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌తో ఈసారి 28విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నారు. స్వదేశీ ఉపగ్రహాల కోటాలో ఇప్పుడు పంపించే ఉపగ్రహాలతో వంద శాటిలైట్‌లను అమ్ములపొదిలోకి పంపిన ఘనత ఇస్రోకు దక్కనుంది. గతేడాది ఆగస్టులో పంపించిన పీఎస్‌ఎల్‌వీ సీ39 ఫెయిల్యూర్‌తో ఈ దఫా రాకెట్‌ను సక్సెస్‌ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు శాస్త్రవేత్తలు.  మొదటి లాంచ్‌పాడ్‌ నుంచి ఈ రాకెట్‌ ప్రయోగానికి సిద్ధంగా ఉంచారు. రాకెట్‌ ప్రయోగం సందర్భంగా షార్‌లో సీఆర్‌పీఎఫ్‌ బృందాలు భారీ భద్రత ఏర్పాటు చేశాయి. మొత్తానికి ఇవాళ ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ40 సక్సెస్‌ కావాలని యావత్‌ భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం కావాలని మనం కూడా ఆల్‌ దిబెస్ట్‌ చెబుదాం..

 

Don't Miss