కబ్జా నుంచి ప్రభుత్వ భూమిని రక్షించిన తహసీల్దార్

09:41 - October 5, 2017

సంగారెడ్డి : ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా 63 ఎకరాల ప్రభుత్వ భూమి. 150 కోట్ల విలువైన స్థలం. అక్రమార్కులు కబ్జా చేసి రికార్డులు తారుమారు చేశారు. ప్రభుత్వ భూమి తమవశమైపోయిందని సంబరపడ్డారు. కానీ అక్రమార్కుల ఎత్తులను ఓ తహసీల్దార్‌ తుత్తునియలు చేశారు. తన విస్తృత అధికారాలు ఉపయోగించి ప్రభుత్వ భూమిని రక్షించారు. ఇంతకీ ఎక్కడా భూమి. ఎవరా తహసీల్దార్‌. లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ...

చూడండి ఈ భూములు ఎంత పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయో. ఈ భూముల పక్కనే చెరువు. ఈ చెరువులోని నీళ్లతోనే ఈ భూములు సాగవుతున్నాయి. ఏడాదికి రెండు పంటలు పండే ఈ భూములపై అక్రమార్కుల కన్నుపడింది.

సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌, శివనాపూర్ తండాలో మధ్యలో ధర్మసాగర్‌ చెరువు ఉంది.  ఈ చెరువు కిందనే 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూములు ఎంతో విలువైనవని, అవి ప్రభుత్వ భూములని తేలడంతో అక్రమార్కుల కళ్లు వీటిపై పడ్డాయి. ఎలాగైనా ఈ భూములను కాజేయాలనుకున్నారు. అందుకోసం పక్కా స్కెచ్‌ వేశారు. 63 ఎకరాల ప్రభుత్వ భూమిని గుట్టుచప్పుడు కాకుండా తమపేర్ల మీద ఓ నలుగురు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.  రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారంతా హైదరాబాద్‌కు చెందిన ప్రభుత్వ మాజీ ఉద్యోగులేకావడం ఇక్కడ  ఆసక్తికర విషయం. వీరికి కొంతమంది రెవెన్యూ అధికారులు సహకారం అందించడంతో విలువైన ప్రభుత్వ భూములను తమపేర రిజిస్ట్రేషన్‌ చేయించుకోగలిగారు. 

కంది మండలం తహసీల్దార్‌గా గోవర్దన్‌ పనిచేస్తున్నారు.  భూ రికార్డులన్నిటిపైనా ఆయన ఈ మధ్య దృష్టి సారించారు. ధర్మసాగర్‌ చెరువు కింద 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు రికార్డుల్లో తేలింది. అయితే దాన్ని కొంతమంది ఆక్రమించుకుని తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్టు కూడా తెలిసింది. దీంతో ప్రభుత్వ భూమిని రక్షించేందుకు తహసీల్దార్‌ గోవర్దన్‌ నడుం బిగించారు.  తన విస్తృత అధికారాలన్నిటినీ ఉపయోగించారు. 1960 చట్టంలోని 26(1) కె(1) ప్రకారం అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించారు.  దీనిపైనా ప్రభుత్వ భూమిని కాజేసిన అక్రమార్కులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల మధ్య హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలువిన్న న్యాయస్థానం తహసీల్దార్‌ చర్యలను సమర్ధించింది. ప్రభుత్వ భూమిని కాపాడినందుకు ప్రశంసించింది.  అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే సివిల్‌ కోర్టులు మాత్రమేకాదు... వాటిని రద్దు చేసే అధికారం తహసీల్దార్‌కు ఉందని గోవర్దన్‌ నిరూపించారు. ఇతర తహసీల్దార్‌లకు ఆయన ఆదర్శంగా నిలిచారు.

తహసీల్దార్‌ తీసుకున్న నిర్ణయం సుమారుగా 150 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని రక్షించింది. దీంతో గోవర్దన్‌పై రైతులు, గ్రామస్తుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.  గోవర్దన్‌ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గోవర్దన్‌లా ప్రతి తహసీల్దార్‌ ఆలోచిస్తే ప్రభుత్వ భూములు కబ్జాకు గురికానేకావు. అంతేకాదు.. ఇప్పటి వరకు కబ్జాకు గురైన భూములు, అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్రభుత్వ భూములను కాపాడవచ్చు.  కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రక్షించవచ్చు.  దీనికి కావాల్సిందల్లా అధికారుల చిత్తశుద్ది మాత్రమే. అధికారులకు చిత్తశుద్ది, చట్టాలను అమలు పర్చాలన్న ఆలోచన ఉంటే అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలు మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇందుకు గోవర్దనే పెద్ద ఉదాహరణ.

Don't Miss