బూడిద కష్టాలు..

19:44 - January 10, 2017

విజయనగరం : పచ్చని పంట పొలాలు బూడిదవుతున్నాయి...బాంబుల మోతతో పల్లె ప్రజలు అల్లాడుతున్నారు... దుమ్ము, ధూళితో బతుకులు బుగ్గిపాలవుతున్నాయి.. ఇది విజయనగరం జిల్లాలో ఓ గ్రామ దీనగాథ.

కొంకిడివరంలో అక్రమ క్వారీ నిర్వహణ
ఎటు చూసినా.. బూడిద.. బాంబుల పేలుళ్లు.. ప్రమాదపు అంచున జీవిస్తున్న ప్రజలు.. విజయనగరం జిల్లా.. గురుగుబిల్లి మండలంలోని కొంకిడివరంలోనిదీ పరిస్థితి. గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్న ఓ కొండపై అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారు. నిత్యం పేలుళ్లు.. బాంబుల మోత.. ఎగిసి పడే బూడిదతో గ్రామస్థులు ఇబ్బందిపడుతున్నారు. మరో మూడు గ్రామాలకు కూడా సమస్యగా మారింది.

అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు
బాంబుల పేలుళ్లతో ఎప్పుడు ఏ ఇంటిపై ఏ బండ వచ్చి పడుతుందోనని గ్రామస్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. అలాగే బూడిద కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. శ్వాసకోశ, ఉబ్బసం వంటి వ్యాధుల బారినపడుతున్నారు. అలాగే భారీ పేలుళ్ల శబ్దాలకు చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి భయపడుతున్నారు.

ప్రభుత్వ స్థలాల్లో గ్రానైట్‌ తవ్వకాలు
క్వారీ నిర్వాహకులు.. అనుమతులు లేకుండానే ప్రభుత్వ స్థలాలలో గ్రానైట్‌ తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండిపడుతోంది. అలాగే మూడు ఎకరాల చెరువు కబ్జా చేశారని గ్రామస్థులు అంటున్నారు. క్వారీకి అనుబంధంగా సర్వే నెంబర్‌ 4/3లో గల భూమిని కబ్జా చేసి అందులో క్రషర్ మిల్లు నడుపుతున్నారని...నిషిద్ధ పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అయినా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని.. పార్వతీపురానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఆధ్వర్యంలో ఈ క్వారీ నిర్వహించడంతో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే నిర్వాహకులు అక్రమంగా తీసుకున్న పేలుడు పదార్థాలను గ్రామస్థులు పట్టుకుని.. పోలీసులకు అప్పజెప్పారు. అయితే పోలీసులు ఇద్దరు కూలీలను మాత్రమే అదుపులోకి తీసుకుని చేతులు దులుపుకున్నారు.

ప్రజలు ధర్నాలు.. నిరసనలు
ఈ అక్రమ క్వారీ గురించి బాధిత గ్రామాల ప్రజలు పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సైతం గ్రామస్థులు క్వారీ గురించి తెలియజేశారు. అయినా ఫలితం కనిపించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. క్వారీని వెంటనే మూయించి, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Don't Miss