కిడ్నీ వ్యాధి ఆ పల్లెలకు శాపం..!

14:23 - October 8, 2018

శ్రీకాకుళం : పచ్చని పల్లెలలో మరణమృదంగం మారు మ్రోగుతుంది. కళ్ళముందే తిరిగాడే మనుషులు చూస్తుండగానే మృత్యవాత పడుతున్నారు. మరణంలో చిన్నాపెద్దా అన్న తేడాలేదు.  ఈ మరణాలన్నింటికి ఒక్కటే కారణం.అదే కిడ్నీ వ్యాధి. ఇన్నాళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంకే పరిమితమైన కిడ్నీ మహమ్మారి...  ఇప్పుడు పక్క మండలాలకు సైతం వ్యాప్తి చెందుతుండటం సిక్కోలు వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. 
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జగన్నాథపురం గ్రామంలోని వారిని కిడ్నీ వ్యాధి సమస్య వెంటాడుతోంది. కొద్ది నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో గ్రామస్తులు చనిపోయారు. మరికొంతమంది కిడ్నీ సమస్య కారణంగా మంచాన పడ్డారు.  ఇప్పటి వరకు మనకు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతమే మనకు తెలుసు. అయితే ఇప్పుడీ మహమ్మారి పక్కనున్న  ప్రాంతాలకు పాకుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తంఅవుతోంది. .  కిడ్నీ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

గ్రామంలోని పిల్లలు , పెద్దలు అన్న తేడాలేకుండా అందరినీ కిడ్నీ వ్యాధి కబలిస్తోంది. ఏ రూపంలో ఈ వ్యాధి ప్రజలను పట్టిపీడిస్తుందో అంతుపట్టకుండా పోతోంది. స్థానికంగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా వ్యాధితో బాధపడేవారు ముందుగా ఆర్‌ఎంపీ వైద్యులనే సంప్రదిస్తున్నారు. ఇకనైనా ఈ ప్రాంతంలోని వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి ఈ వ్యాధి అసలు కారణాలు కనుగొనాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామాన్ని కిడ్నీ సమస్య వెంటాడుతుండడంతో యువకులకు వివాహాలు కావడం లేదు. వారిని ఎవరూ ఉద్యోగాల్లో చేర్చుకోవడం లేదు. దీంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు. తమ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
 

Don't Miss