భారత్ క్లీన్ స్వీప్..

16:16 - December 20, 2016

చెపాక్ : చివరి టెస్టు...మ్యాచ్ డ్రా గా ముగుస్తుందా ? లేక భారత్ విజయం సాధిస్తుందా ? లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఒక వికెట్ పోకుండా 97 పరుగులు చేసింది. దీనితో మ్యాచ్ రసకందాయంలో పడింది. చివరకు మలుపు తిరిగింది. భారత బౌలర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏడు వికెట్లు సాధించి పతనాన్ని శాసించాడు. చివరకు భారత్ అద్భుత విజయం సాధించింది. వరుసగా 18 టెస్టు మ్యాచ్ ల్లో భారత్ జయభేరి మోగించింది. 1992 తరువాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసుకుంది. ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించింది.

ఆలీ..బెన్ స్టోక్స్..
మంగళవారం ఆఖరి రోజు. 12/0 ఓవర్ నైట్ స్కోర్ తో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. కెప్టెన్ కుక్, జెన్సింగ్స్ ఆచితూచి బాధ్యాతయుతంగా ఆడారు. తొలి సెషన్ లో వికెట్ పోకుండా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరి వికెట్ తీయాలని భారత బౌలర్లు కష్టపడ్డారు. తొలి వికెట్ కు కుక్..జెన్సింగ్స్ లు 103 పరుగులు జోడించారు. రెండో సెషన్ ప్రారంభమైంది. భారత బౌలర్లు ఈ సెషన్ లో విజృంభించారు. ఒక పరుగు చేస్తే అర్ధ సెంచరీ నమోదు కావాల్సిన తరుణంలో కుక్ (49) ను జడేజా వెనక్కి పంపాడు. కొద్దిసేపటిలోనే జెన్సింగ్ (54) వెనుదిరిగాడు. 110 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 126 పరుగుల వద్ద రూట్ వికెట్ ను జడేజా తీశాడు. మొయిన్ ఆలీ భారత బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబట్టేందుకు కృషి చేశాడు. ఇతనికి కొద్దిసేపు బెన్ స్టోక్స్ సహకారం అందించాడు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతారా అనే సందేహం అభిమానుల్లో కలిగింది. 63 పరుగులను జోడించడంతో ఇంగ్లండ్ గాడిలో పడ్డట్టే కనిపించింది.

జడేజా విజృంభజన..
కానీ మొయిన్ (44) ను జడేజా అవుట్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అనంతరం బెన్ (23) కూడా అవుట్ అయ్యాడు. పూర్తిగా మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చేసినట్లేనని అభిమానులు భావించారు. అభిమానుల ఆశలకు తగట్టే భారత బౌలర్లు విజృంభించారు. వరుసగా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 207 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రధానంగా జడేజా ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పరాజయానికి కారకుడయ్యాడు. జడేజా ఏడు, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మిశ్రాలు తలా ఒక వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్ కోహ్లికి లభించగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరుణ్ నాయర్ కు దక్కింది. భారత్ కు వరుసగా 18 వ టెస్టు విజయం. 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ : 477 ఆలౌట్..
భారత్ మొదటి ఇన్నింగ్స్ : 759/7.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 207 ఆలౌట్.

Don't Miss