ఐదో వన్డేలో భారత్‌ ఘన విజయం

08:46 - September 4, 2017

ఢిల్లీ : శ్రీలంకపై ఐదో వన్డేల్లోనూ భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్విప్‌ చేసింది. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న విరాట్‌సేన.. వన్డేల్లోనూ అదే దూకుడు ప్రదర్శించింది. చివరి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. సిరీస్‌లో ఒక్కమ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలబెట్టుకుందామనుకున్న లంశ ఆశలు నెరవేరలేదు. 
 
శ్రీలంకతో జరిగిన 5 వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్విప్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంకపై కోహ్లీసేన ఘన విజయం సాధించింది. ఆరువికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది. దీంతో 5-0తో వన్డే సిరీస్‌ను కోహ్లీ సేన దక్కించుకుంది.

శ్రీలంక ఉంచిన 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. 17 పరుగుల దగ్గర రహానే, 29 రన్స్‌ దగ్గర రోహిత్‌శర్మ పెవిలియన్‌ చేరారు.  అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడాడు. 116 బంతుల్లో 110పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మనీశ్‌పాండేతో కలిసి మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టుస్కోరు 128 పరుగుల దగ్గర పాండే ఔటైనా.. కోహ్లీ ఆగలేదు. తనదైన శైలిలో దూకుడు కొనసాగించాడు. కేదార్‌ జాదవ్‌తో కలిసి వీరవిహారం చేశాడు.  చక్కని కవర్‌డ్రైవ్‌లతో సొగసైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. నాలుగో వికెట్‌కు 109 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు.  ఈ క్రమంలోనే వన్డేల్లో 30వశతకం బాదాడు.  194 మ్యాచుల్లోనే కోహ్లీ ఈ ఘతన సాధించడం ఓ అరుదైన రికార్డు.  46.3 ఓవర్లలో  భారత్‌ 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 5వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్‌కుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కగా... మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ బుమ్రాకు లభించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్‌ భువనేశ్వర్‌కుమార్‌ వీర విజృంభణ చేసి కీలకమైన 5వికెట్లు తీశాడు.  బుమ్రా 2, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌ చెరో వికెట్‌ నేలకూల్చారు. లంక బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ, లాహిరు తరిన్నె, మాథ్యూస్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా వారెవ్వరూ పట్టుమని పదిపరుగులు కూడా చేయలేకపోయారు.

ఇదే వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ సైతం ఓ రికార్డను నమోదు చేశాడు.  100 మందిని స్టంపింగ్స్‌ చేసిన ఒకే ఒక వ్యక్తిగా ధోనీ అవతరించాడు.  గత మ్యాచ్‌లో గణతిలకను స్టంపౌట్‌ చేయడంతో 99 వద్ద నిలిచిన ధోనీ.. చివరి వన్డేలో అఖిల ధనంజయను పెవిలియన్‌కు పంపి 100 స్టంపింగ్స్‌ చేసిన వ్యక్తిగా నిలిచాడు. 301 మ్యాచుల్లోనే ధోనీ ఈ ఘనత సాధించాడు. 

 

Don't Miss