రెండో వన్డేలో భారత్ ఘన విజయం

22:07 - February 4, 2018

దక్షిణాఫ్రికా : టెస్టు సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటోంది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందు బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా తర్వాత బ్యాటింగ్‌లో విరుచుకుపడింది. కేవలం ఒక వికెట్ కోల్పోయి.. లక్ష్యాన్ని చేరుకుంది. 

తొలి వన్డేలో ఓటమితో ఆత్మవిశ్వాసం లోపించడం, గాయాలతో సారథి డుప్లెసిస్‌, సీనియర్‌ ఆటగాడు డివిలియర్స్‌ జట్టుకు దూరం కావడంతో... సౌతాఫ్రికా... సొంతగడ్డపైనే కష్టపడుతోంది. తొలి వన్డేలో ఓడిన సఫారీలు.. సెంచూరియన్‌లో జరిగిన రెండోవన్డేలో ఏమాత్రం ప్రతిఘటన చూపలేకపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్... సఫారీలను ఏమాత్రం నిలవనీయలేదు. ఆతిథ్యజట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మణికట్టు స్పిన్‌ ద్వయం యజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ కకావికలం చేశారు. సఫారీ జట్టును తమ సొంతగడ్డపైనే తొలిసారి అత్యంత తక్కువ స్కోరు 118కి ఆలౌట్‌ చేశారు. ఆరంభంలో హషీమ్‌ ఆమ్లా, డికాక్ దూకుడుగానే బ్యాటింగ్ ప్రారంభించారు. తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆమ్లాను ఔట్‌ చేయడం ద్వారా భువనేశ్వర్‌ ఈ జోడీని విడదీశాడు. జట్టు స్కోరు 51 వద్ద మరో ఓపెనర్‌ డికాక్‌ను పెవిలియన్‌ పంపించి చాహల్‌ విజృంభించాడు. ఆ తర్వాత ఓవర్‌లో తాత్కాలిక సారథి మార్కమ్‌, డేవిడ్‌ మిల్లర్‌ ను ఔట్‌ చేసి భారీ దెబ్బ కొట్టాడు కుల్‌దీప్‌. దీంతో 51 వద్దే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు చేజార్చుకుంది. ఆ తరువాత డుమిని, జొండొ కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జట్టు స్కోరు 99 వద్ద జొండోను, 107 వద్ద డుమినిని చాహలే పెవిలియన్‌కు పంపడంతో సఫారీల కథ దాదాపు ముగిసింది. టెయిలెండర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో... సౌతాఫ్రికా 118 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా చివరి ఆరు వికెట్లను 19 పరుగుల వ్యవధిలో చేజార్చుకోవడం గమనార్హం. చాహల్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అంతేకాదు దక్షిణాఫ్రికాలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా అవతరించాడు. 

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 15 పరుగుల వ్యక్తిగత స్కోరుకే ఔటైనా... ధావన్, కెప్టెన్ కోహ్లీ... స్కోరుబోర్డును పరుగెత్తించారు. మరో వికెట్‌ పడకుండా 20.3 ఓవర్లలోపే జట్టుకు విజయాన్ని అందించారు. అయితే విజయానికి మరో 2 పరుగులు ఉండగా... లంచ్ బ్రేక్ వచ్చింది. సఫారీల ఇన్నింగ్స్‌ త్వరగా ముగియడంతో టీమిండియా.. లంచ్ కంటే ముందే బ్యాటింగ్‌కు దిగింది. దీంతో మరో రెండు పరుగులు చేస్తే విజయం వరిస్తుందనగా నిబంధనల ప్రకారం అంపైర్లు ఆటకు విరామం ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. ధావన్ 51 పరుగులు చేయగా... కోహ్లీ 46 రన్స్ చేశాడు. 5 వికెట్లు తీసిన చాహల్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Don't Miss