దుమ్ము రేపిన కోహ్లీ సేన...

06:46 - February 2, 2018

ఢిల్లీ : డర్బన్‌ వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. కోహ్లీసేన సఫారీ జట్టుకు చుక్కులు చూపించింది. 6వికెట్లతేడాతో ఆతిథ్యజట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. మొత్తం ఐదువన్డేల సిరీస్‌లో 1-0తో టీమ్‌ఇండియా ముందంజవేసింది. విరాట్‌ ఆర్మీ మరోసారి దుమ్మురేపింది. కోహ్లీసేన దూకుడు ముందు డూప్లెసిస్‌ బ్యాచ్‌ విలవిల్లాడింది. 270 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఈజీగా ఛేదించింది. భారత్‌ విజయంలో విరాట్‌ మరోసారి కీలకంగా మారాడు. మొత్తం 119 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 10ఫోర్లతో 112 రన్స్‌ సాధించాడు. అటు రహానే 86 బంతుల్లో 5ఫోర్లు, 2భారీ సిక్స్‌లతో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 79 పరుగులు సాధించిన రహానే కెప్టెన్‌ కోహ్లీకి సరిజోడు అనిపించుకున్నాడు.

కోహ్లిసేన ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ20 పరుగులు, శిఖర్‌ ధవన్‌ 35 పరుగులు చేసి అవుటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన సారధి కోహ్లి రహనేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రహనే కూడా నెమ్మదిగా బౌండరీలు కొడుతూ క్రీజులో పుంజుకున్నాడు. రహనే 79 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఫెలూక్వాయో వేసిన బంతికి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత అల్‌రౌండర్‌ హార్దిక్‌​పాండ్యా కోహ్లితో కలిశాడు. సారథి విరాట్‌ తన అద్బుతమైన ఆటతీరుతో అందర్నీ అకట్టుకున్నాడు. 45 ఓవర్లో ఫెలూక్వాయో వేసిన మూడో బంతికి రబడాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 112 పరుగులు చేసిన కోహ్లి తన కెరీర్‌లో 33వ సెంచరీని సాధించాడు.
అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 269పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డీకాక్‌, హషీమ్‌ ఆమ్లాలు ఆరంభించగా సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ ఆమ్లా16 పరుగులు చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. బూమ్రా బౌలింగ్‌లో ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై సఫారీ ఇన్నింగ్స్‌ను డీకాక్‌-డు ప్లెసిస్‌లు కొనసాగించారు. జట్టు స్కోరు 83 వద్ద 34 పరుగులు డీకాక్‌ రెండో వికెట్‌గా అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌ కు వచ్చిన మర్‌క్రామ్‌, డుమినీ, మిల్లర్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఇదే సమయంలో క్రిస్‌ మోరిస్‌-డు ప్లెసిస్‌ జోడి ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. ఈ ఇద్దరూ 74 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా జట్టు సఫారీలు రెండొందల మార్కును చేరింది. మోరీస్‌ 37 పరుగులు చేసి అవుటవ్వగా టెయిలెండర్ ఫెలూక్వాయో27 పరుగులు చేశాడు. కాగా.. సఫారీల ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఒంటిచేత్తో నడిపించాడు. 112 బంతుల్లో 120 పరుగుల చేసిన డూప్లెసిస్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 269 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరపడింది.

భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, చాహల్‌ రెండు వికెట్లు తీశాడు. ఇక బూమ్రా, భువనేశ్వర్‌లకు తలో వికెట్‌ దక్కింది. అటు దక్షిణాఫ్రికా బౌలర్లలో బౌలర్లలో ఫెలూక్వాయో రెండు వికెట్లు, మోర్నీ మోర్కెల్‌ ఒక వికెట్‌ దక్కాయి. ధోని విన్నింగ్‌ షాట్‌ తో భారత్‌ విజయాన్ని సాధించింది. ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 45.3 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది.దీంతో 5 వన్డేల సిరీస్‌లో విరాట్‌ ఆర్మీ 1-0తో ముందజ వేసింది. 

Don't Miss