ఇండియా, ఇంగ్లండ్ ఆఖరి టెస్ట్‌కు కౌంట్‌డౌన్‌

10:56 - December 16, 2016

చెన్నై : ఇండియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య 5వ టెస్ట్‌కు  రంగం సిద్ధమైంది. ముంబై టెస్ట్‌లో సంచలన విజయం సాధించిన విరాట్‌ ఆర్మీ ఆఖరి  టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌తో పాటు ప్రస్తుత సీజన్‌ను విజయంతో ముగించాలని తహతహలాడుతోంది. అంచనాలకు తగ్గట్టుగా రాణించి టీమిండియా ఆధిపత్యానికి చెక్‌ పెట్టి ఓదార్పు విజయం సాధించాలని కుక్‌ అండ్‌ కో  పట్టుదలతో ఉంది. 

ఇండియా-ఇంగ్లండ్‌  టెస్ట్‌ సిరీస్‌లోని  క్లైమాక్స్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.5 మ్యాచ్‌ల సిరీస్‌లోని అసలే మాత్రం ప్రాధ్యాన్యం లేని ఆఖరి మ్యాచ్‌కు చెన్నె చెపాక్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. 

వైజాగ్‌, మొహాలీ, ముంబై టెస్ట్‌ల్లో మోత మోగించిన కొహ్లీ అండ్‌ కో ఆఖరి టెస్ట్‌లోనూ నెగ్గి తీరాలని తహతహలాడుతుండగా....మరోవైపు ఆతిధ్య జట్టు ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలని కుక్‌ అండ్‌ కో పట్టుదలతో ఉంది.   

ఇరు జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో ఇంగ్లండ్‌దే పై చేయిగా ఉన్నా...ప్రస్తుతం టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియా ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే. గత 17 టెస్టుల్లో ఓటమంటూ లేని టీమిండియా...ఆఖరి టెస్ట్‌లోనూ అదే స్థాయిలో చెలరేగాలని పట్టుదలతో ఉంది.
భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ బలోపేతంగా 
కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు టెస్ట్‌ స్పెషలిస్ట్‌లు, టాప్‌ క్లాస్‌ స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లతో పవర్‌ఫుల్‌గా ఉంది. మురళీ విజయ్‌,పుజారా  కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో కెప్టెన్‌ కొహ్లీ జట్టును ముందుండి నడిపిస్తుండటంతో భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ బలోపేతంగా ఉంది. అంతంత మాత్రంగానే రాణిస్తోన్న అజింక్యా  రహానే,రాహుల్‌ పూర్తి స్థాయిలో చెలరేగితే భారత బ్యాటింగ్‌కు తిరుగుండదు. 

అశ్విన్‌,జడేజా,జయంత్‌ యాదవ్‌ వంటి మేటి స్పిన్నర్లతో భారత స్పిన్‌ బౌలింగ్‌ విభాగం ఎప్పటిలానే పటిష్టంగా ఉంది.  మొహాలీ టెస్ట్‌లో భారత స్పిన్ త్రయం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌ విజయంలో కీలక పోషించిన సంగతి తెలిసిందే. అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌, జయంత్‌ యాదవ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరో వైపు ఇంగ్లండ్‌  జట్టు ప్రస్తుత సిరీస్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించింది లేదు. బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా....ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది.అలిస్టర్‌ కుక్‌,జో రూట్ స్థాయికి తగ్గట్టుగా భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతుండటంతో ఇంగ్లండ్‌ జట్టు తేలిపోతోంది.  ప్రధానంగా  భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. 

స్పిన్నర్లు మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ ఫర్వాలేదనిపిస్తోన్నా... స్పీడ్‌ గన్‌ జేమ్స్‌ యాండర్సన్‌,అంతగా ప్రభావం చూపలేకపోతుండటంతో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలమవుతోంది.ప్రతికూలతలన్నీ అధిగమించి చివరి టెస్ట్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని ప్లాన్‌లో ఉంది.


స్పిన్నర్లకు అనుకూలించే చెపాక్‌ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఫామ్‌ చూస్తుంటే....చెన్నై టెస్ట్‌లోనూ  టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆఖరి టెస్ట్‌లోనూ నెగ్గి  కొహ్లీ అండ్‌ కో  సిరీస్‌తో పాటు ప్రస్తుత సీజన్‌ను విజయంతో ముగిస్తుందో లేదో చూడాలి. 

Don't Miss