రాహుల్ 'డబుల్' మిస్..

07:41 - December 19, 2016

ఇంగ్లండ్ భారీ స్కోరుకు టీమిండియా ఏమాత్రం బెద‌ర‌లేదు. కెప్టెన్ కోహ్లీ నిరాశపరిచినా... ఓపెనర్ కేఎల్ రాహుల్ వీరవిహారంతో మూడో రోజు భారత్ ఆధిపత్యం కనిపించింది. ఉద్వేగంతో రాహుల్ తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నా... ముగిసే నాటికి భారత్‌ 4 వికెట్లకు 391 ప‌రుగులు చేసింది. చెపాక్‌లో భారత్‌ ఇంగ్లాండ్‌కు దీటుగా బదులిస్తోంది. యువ ఓపెన‌ర్ లోకేష్ రాహుల్ ఒక్క ప‌రుగుతో కెరీర్‌లో డ‌బుల్ సెంచ‌రీ మిస్సయినా.. టీమ్‌ను మాత్రం పటిష్ట స్థితిలో నిలిపాడు. అత‌నికి వికెట్ కీపర్ పార్థివ్ ప‌టేల్, మ‌రో యువ బ్యాట్స్‌మ‌న్ క‌రుణ్ నాయ‌ర్ మంచి స‌హ‌కారం అందించ‌డంతో మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల‌కు 391 ప‌రుగులు చేసింది.

లంచ్ సమయానికి..
ప్రస్తుతం క‌రుణ్ నాయ‌ర్ 71, విజ‌య్ 17 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకా 86 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ పుజారా 16, మెన్‌ ఇన్ ఫామ్, కెప్టెన్ కోహ్లి 15 నిరాశపరిచారు. 60 ప‌రుగుల ఓవ‌ర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన టీమిండియాకు ఓపెన‌ర్లు రాహుల్‌, పార్థివ్ ప‌టేల్ సెంచ‌రీ ఓపెనింగ్ పార్ట్‌న‌ర్‌షిప్ అందించారు. తొలి వికెట్‌కు 152 ప‌రుగులు జోడించిన త‌ర్వాత‌.. పార్థివ్ ఔట‌య్యాడు. దీంతో లంచ్ స‌మ‌యానికి భార‌త్‌.. వికెట్ న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది.

భారత్ పై చేయి..
లంచ్ త‌ర్వాత కాసేప‌టికే రాహుల్ టెస్టుల్లో నాలుగో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంట‌నే పుజారా, కోహ్లి త‌క్కువ వ్యవ‌ధిలోనే వెనుదిర‌గ‌డంతో మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు బిగించింది. అయితే కాసేపట్లోనే రాహుల్‌తో, యువ బ్యాట్స్‌మ‌న్ క‌రుణ్ నాయ‌ర్ జ‌త క‌లిసి కుక్ సేన ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. ఈ ఇద్దరూ క‌లిసి ఐదో వికెట్‌కు 161 ప‌రుగులు జోడించ‌డంతో టీమిండియా ప‌టిష్ఠ స్థితికి చేరింది. ఈ క్రమంలో మంచి ఊపు మీదున్న రాహుల్ డ‌బుల్ సెంచ‌రీ చేసేలా క‌నిపించినా.. ఉద్వేగంతో చివ‌రికి ఒక్క ప‌రుగు దూరంలో ఉండ‌గా ర‌షీద్ బౌలింగ్‌లో బ‌ట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తమ్మీద మూడో రోజు ఆటలో భారత్‌ పైచేయి సాధించింది.

Don't Miss