మొదటి రోజు రాణించిన భారత్

07:27 - January 6, 2018

కేప్ టౌన్ : మ్యాచ్‌ ఆరంభమైన 30 నిమిషాల్లోనే ముగ్గురు టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపి భువనేశ్వర్‌ కుమార్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 4.5 ఓవర్లకు 12 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌ భారత పేసర్లపై ఎదురుదాడికి దిగాడు. అప్పటి వరకు చెమటలు పట్టించిన భువీ బౌలింగ్‌లో 9వ ఓవర్లో 4 ఫోర్లు బాది 17 పరుగులు సాధించాడు. వైవిధ్య బంతులను ఎదుర్కొంటూ ఏబీడీ, డుప్లెసిస్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. సఫారీ సారథి డుప్లెసిస్‌ సహకారంతో దూకుడుగా ఆడిన డివిలియర్స్‌ కెరీర్‌లో 41వ అర్ధశతకం సాధించాడు. లంచ్‌ విరామం తర్వాత ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఈ జోడీని 114 పరుగుల వద్ద బుమ్రా విడదీశాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన యువ బౌలర్‌ బుమ్రా బౌలింగ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ బౌల్డ్‌ అయ్యాడు. అప్పటి వరకు ఎవరికీ చిక్కకుండా ఆడిన ఏబీడీని ఔట్‌ చేసి బుమ్రా ప్రశంసలందుకున్నాడు.

నిలకడగా ఆడుతూ వచ్చిన డుప్లెసిస్
క్రీజులో అడుగుపెట్టింది మొదలు నిలకడగా ఆడుతూ వచ్చిన డుప్లెసిస్ ఈ క్రమంలో కెరీర్‌లో 16వ అర్ధశతకం నమోదు చేశాడు. అనంతరం కొద్దిసేపటికే యువ ఆల్‌రౌండర్‌ పాండ్య వేసిన బంతికి జట్టు స్కోరు 142 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డికాక్‌ 40 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు సాధించాడు. ఫిలాండర్‌ 35 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. వీరిద్దరూ చాలా వేగంగా 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా కేశవ్‌ మహరాజ్‌(35), కగిసో రబాడ(26) ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వీలైనన్ని పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచాలనే ఉద్దేశంతో సింగిల్స్‌ తీస్తూనే బౌండరీలు బాదారు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో రబాడ, మోర్కెల్‌ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ నాలుగు, అశ్విన్‌ రెండు, షమీ, బుమ్రా, పాండ్య తలో వికెట్‌ దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు కట్టడి చేసి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు.. సఫారీ బౌలర్లు షాకిచ్చారు. టాప్‌ ఆర్డర్‌ ముగ్గురు ఆటగాళ్లు చెత్త షాట్లు ఆడి పెవిలియన్‌కు వరుస కట్టారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. భారత్‌ ఇంకా 258 పరుగులు వెనుకబడి ఉంది. పుజారా(5), రోహిత్‌ శర్మ(0) క్రీజులో ఉన్నారు.

Don't Miss