బోణీ కొట్టిన టీంఇండియా

07:36 - August 21, 2017

డంబూల్లా : టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. శిఖర్‌ దావన్‌ సిక్సర్లు, కోహ్లీ షాట్లు భారత్‌ను సునాయాసంగా గెలిచేలా చేశాయి.ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా... దంబూల్లా వన్డేలో కోహ్లీ సేన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి... 28.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ లంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. శ్రీలంక బౌలర్లు ఎంత శ్రమించినా... భారత బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయలేకపోయారు. దీంతో.. ధవన్‌ 90 బంతుల్లోనే 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధవన్‌ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డ్‌ సాధించాడు. రోహిత్‌శర్మ 4 పరుగులకే వెనుదిరగడంతో... క్రీజులోకి వచ్చిన విరాట్‌.. ధావన్‌లు చెలరేగి ఆడారు. కోహ్లీ 70 బంతుల్లో 82 పరుగులు చేసి... నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్‌ సెంచరీ చేసేవరకు నిలకడగా ఆడిన కోహ్లీ.. తర్వాత విరుచుకుపడి వరుస బౌండరీలు బాదాడు. దీంతో భారత్‌ 28.5 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని సాధించింది.

లంక 216 పరుగులకు ఆలౌట్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. అదిరే ఆరంభం ఇచ్చింది. ఓపెనర్లు నిరోషన్‌ డిక్వెలా, గుణతిలకలు చెలరేగి ఆడారు. చాహల్‌ ప్రమాదకర జోడిని విడదీయడంతో తొలి వికెట్‌కు 74 పరుగులు చేశారు. అనంతరం కుశాల్‌ మెండిస్‌తో డిక్వెలా దూకుడు కొనసాగించాడు. ఆ తర్వాత... లంక వికెట్ల పతనం మొదలైంది. చివరి ఏడు వికెట్లు 11 ఓవర్లలోనే కుప్పకూలిపోయాయి. కేదార్‌ జాదవ్‌, అక్షర్‌ పటేల్‌, చౌహల్‌ స్పిన్‌ దాటికి.. లంక బ్యాట్స్‌మెన్లు తట్టుకోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంక 216 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

సునాయసంగా గెలుపు...
తక్కువ పరుగుల లక్ష్యమే కావడంతో... కోహ్లీ సేన సునాయసంగా గెలుపొంది ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. అత్యుత్తమంగా బ్యాటింగ్‌ చేసి.. సెంచరీ చేసిన శిఖర్‌ ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. గురువారం రెండో వన్డే పల్లెకల్‌లో జరగనుంది. 

Don't Miss