శ్రీలంకతో భారత్ కీలక వన్డే సిరీస్‌

22:00 - August 19, 2017

ఢిల్లీ : రెండు సార్లు వన్డే వరల్డ్ చాంపియన్‌ ఇండియా విదేశీ గడ్డపై మరో కీలక వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. భారత్‌, శ్రీలంక జట్ల మధ్య 5 వన్డేల సిరీస్‌లోని తొలి వన్డేకు రంగిరీలోని దంబుల్లా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో  రంగం సిద్ధమైంది.యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు ఉపుల్ తరంగ సారధ్యంలోని శ్రీలంక టీమ్‌ సవాల్‌ విసురుతోంది.  తొలి వన్డేలో నెగ్గి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని విరాట్‌ ఆర్మీ పట్టుదలతో ఉంది.

శ్రీలంకతో కీలక వన్డే సిరీస్‌కు కొహ్లీ అండ్‌ కో సై అంటే సై అంటోంది. టెస్ట్‌ సిరీస్‌లో శ్రీలంకను బ్రౌన్‌ వాష్‌ చేసిన భారత్...వన్డే సిరీస్‌ను సైతం క్లీన్‌ స్వీప్‌ చేయాలని తహతహలాడుతోంది. భారత్‌-శ్రీలంక మధ్య 5వన్డేల సిరీస్‌లోని తొలి  వన్డేకు రంగిరీలోని దంబుల్లా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో  రంగం సిద్ధమైంది.

ఇండియా ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో ఉండగా ...శ్రీలంక 8వ ర్యాంక్‌లో ఉంది. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన భారత జట్టు సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు అటు అనుభవజ్ఞులు, ఆల్‌రౌండర్లు, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో పవర్‌ఫుల్‌గా ఉంది.

టాప్ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, మిడిలార్డర్‌లో రహానే,రాహుల్‌లతో పాటు  లోయర్‌ ఆర్డర్‌లో ధోనీ,కేదార్‌ జాదవ్‌,హార్డిక్‌ పాండ్య  వంటి హార్డ్‌ హిట్టర్లతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది.

భువనేశ్వర్‌ కుమార్‌,బుమ్రాలతో పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగా ఉంది. కానీ మ్యాజిక్‌ స్పిన్నర్లు అశ్విన్‌,జడేజా లేకుండానే భారత్‌ బరిలోకి దిగనుంది.వీరి స్థానంలో జట్టులోకొచ్చిన అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌,యజ్వేంద్ర చహాల్‌ ఏ స్థాయిలో రాణిస్తారో చూడాలి.  టీమ్‌ కాంబినేషన్‌ ఎలా ఉండబోతున్నా...భారత జట్టు విజయావకాశాలు మాత్రం బ్యాట్స్‌మెన్‌ రాణించడం మీదనే ఆధారపడి ఉన్నాయి.

మరోవైపు  వన్డే సిరీస్‌లో నెగ్గి టెస్ట్‌ సిరీస్‌ ఓటమికి భారత్‌పై బదులు తీర్చుకోవాలని శ్రీలంక ప్లాన్‌లో ఉంది.  ఉపుల్‌ తరంగ నాయకత్వంలోని శ్రీలంక జట్టు....ఏంజెలో మాథ్యూస్‌,తిసెరా పెరీరా, లసిత్‌ మలింగా వంటి సీనియర్‌ ఆటగాళ్ల మీదే భారం వేసింది. 

ప్రస్తుత టీమ్ కాంబినేషన్‌, ట్రాక్‌ రికార్డ్‌ పరంగా తొలి వన్డేలో టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహమే లేదు. మరి మొదటి వన్డేలో నెగ్గి 5వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసే జట్టేదో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్‌ చేయాల్సిందే.

Don't Miss