పసిడితో చరిత్ర సృష్టించిన యువత..

07:13 - October 10, 2018

ఢిల్లీ : యూత్‌ ఒలింపిక్స్‌లో మిజోరాం వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగా చరిత్ర సృష్టించాడు. అతను ఈ క్రీడల చరిత్రలోనే భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. మరోవైపు షూటింగ్‌ సంచలనం మను బాకర్‌ కూడా చక్కటి ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. యూత్‌ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రినుంగా సంచలన ప్రదర్శన చేశాడు. మిజోరాంకు చెందిన 15 ఏళ్ల లాల్‌.. 62 కేజీల విభాగంలో పసిడితో మెరిశాడు. స్నాచ్‌లో 124 కేజీలు ఎత్తిన లాల్‌... క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 150 కేజీలు, మొత్తం మీద 274 కేజీలు లిఫ్ట్‌ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక  సంచలన షూటర్‌ మనుబాకర్‌ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఆమె స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రష్యా అమ్మాయి అనా ఇనినా గట్టి పోటీ ఇచ్చినా.. 236.5 పాయింట్లతో పసిడి ఎగరేసుకుపోయింది. భారత్‌కు ఇవే ఉత్తమ యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడలు కాబోతున్నాయి. ఇప్పటికే నాలుగు పతకాలు గెలిచిన భారత్‌.. గత రికార్డును తుడిచిపెట్టింది. 
 

 

Don't Miss