గోల్ట్ కోస్ట్ లో భారత్ పసిడి పంట..

20:47 - April 14, 2018

ఆస్ట్రేలియా : గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతున్న 21వ కామన్వెల్త్‌ పోటీల్లో ఇవాళ భారత్‌కు ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. శనివారం ఒక్కరోజే ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. భారత మహిళా బాక్సింగ్ సంచలనం మేరీకోమ్‌, బాక్సర్ గౌరవ్ సోలంకి స్వర్ణ పతకాలతో శుభోదయం పలకగా... తర్వాతి వంతు సంజయ్ రాజ్‌పుత్‌కి వచ్చింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో రాజ్‌పుత్ బంగారు పతకం సాధించాడు. అదే పంథాలో పయనించిన భారత జావెలిన్ సంచలనం నీరజ్ చోప్రా సైతం చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ జావెలిన్ త్రో పోటీల్లో భారత్‌కు స్వర్ణపతకం అందించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వీరితో పాటు రెజ్లర్లు సైతం అద్భుత ప్రదర్శన కనబర్చారు. మహిళల విభాగంలో వినేశ్ ఫోగాట్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా... పురుషుల విభాగంలో సుమిత్ మాలిక్ బంగారు పతకం దక్కించుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 23 బంగారు పతకాలు వచ్చి చేరాయి. ఇక బాక్సర్లు మనీష్ కౌశిక్, అమిత్ ఫాంగల్ రజత పతకాలతో మెరిశారు. దీంతో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఇప్పటివరకు 52కు చేరాయి. 

Don't Miss