కుమ్మేశారు..

06:56 - September 1, 2017

కోహ్లీసేన మరో భారీ విజయం సాధించింది. శ్రీలంక జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. కొలంబో వేదికగా ఏకపక్షంగా సాగిన నాలుగో వన్డేలో భారత బ్యాటింగ్‌, బౌలింగ్‌కు లంక విలవిల్లాడింది. సొంతగడ్డపై తొలిసారి 168 పరుగులు భారీ తేడాతో ఓడిన లంకజట్టు చెత్త రికార్డు సొంతం చేసుకుంది. నాలుగో వన్డేలో టాస్‌ గెలిచిన భారత్‌..మొదట బ్యాటింగ్‌ చేసింది. కెప్టెన్‌ కోహ్లీ 96 బాల్స్‌లో 131 పరుగులు చేయగా.. రోహిత్‌ శర్మ 88 బంతుల్లో 104 పరుగులతో మ్యాచ్‌ను హోరెత్తించారు. ఇద్దరు బ్యాట్స్‌మన్‌ సెంచరీలు చేయడంతో ..

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక జట్టును టీమిండియా బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. బుమ్రా, పాండ్యా, కుల్దీప్‌ తలో రెండు వికెట్లతో చెలరేగడంతో 207 పరుగులకే లంకజట్టు కుప్పకూలింది. 70 పరుగులు చేసిన ఏంజెలో మాథ్యూస్‌ ఒంటరిపోరాటం చేశాడు. 39 రన్స్‌ చేసిన మరో బ్యాట్స్‌మన్‌ సిరివర్దనే కాస్త ఫర్వాలేదని పించాడు.

అయితే ..మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ రూపంలో మొదటి ఝట్కా తగిలింది. 4 పరుగులు చేసిన శిఖర్‌ అనూహ్యంగా వికెట్ పారేసుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్‌కు తోడైయ్యాడు. తన స్టైలీష్‌ బ్యాటింగ్‌తో కోహ్లీ మరోసారి పరుగులు వరద పారించాడు. వరుస బౌండరీలతో 38 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన కోహ్లీ అదే ఊపులో 76 బంతుల్లోనే శతకం బాదేశాడు. దీంతో వన్డేల్లో సచిన్‌ 49, రికీ పాంటింగ్‌ 30 సెంచరీల తర్వాత 29 సెంచరీలతో విరాట్‌ మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు రోహిత్‌ సిరీస్‌లో వరుసగా రెండో శతకం బాది టీమిండియా సత్తాను చాటాడు. ప్రమాదకరంగా మారిన విరాట్‌-రోహిత్‌జోడీని స్పీడ్‌స్టర్‌ మలింగ విడదీశాడు. 29వ ఓవర్‌ 3వ బంతికి కోహ్లీని ఔట్‌ చేసిన మలింగ తన కెరీర్‌లో 300వ వికెట్‌ సాధించాడు.

భారత్‌ 262 స్కోరు వద్ద పాండ్యా, రోహిత్‌.. మాథ్యూస్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్ట్రోక్‌ ప్లేయర్‌ లోకేశ్‌ రాహుల్‌ నిరుత్సాహ పరిచాడు.. 7 పరుగులు చేసిన వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింక్‌కు వచ్చిన మనీశ్‌ పాండేకు ధనాధన్‌ ధోనీ తోడైయ్యాడు. పాండే 4ఫోర్లు, 1 సిక్స్‌తో 42 బంతుల్లోనే అర్థసెంచరీ కొట్టగా.. ధోనీ తన 300వ వన్డేలో మరోసారి విశ్వరూపం చూపించాడు.. 42 బాల్స్‌కు 49 పరుగులు పిండేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 101 పరుగులు ఆజేయ భాగస్వామ్యం అందించడంతో భారత్‌ 375/5తో లంకముందు భారీ టార్గెట్‌ను పెట్టింది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను ఊడ్చేసిన కోహ్లీబ్యాచ్‌.. ఇపుడు వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ పై దృష్టిపెట్టింది. 5మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4మ్యాచ్‌ల్లో విజయంసాధించిన టీమిండియా.. మరొక్క గెలుపుతో లంకకు సొంతగడ్డమీదే వైట్‌వాష్‌ వేయాలని ఉవ్విళ్లూరుతోంది. 

Don't Miss