అండర్ 19లో దూసుకెళ్తున్న భారత్

07:42 - January 20, 2018

ఆస్ట్రేలియా : అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.పృద్వీ షా సారధ్యంలోని భారత జట్టు గ్రూప్‌ దశను ఓటమంటూ లేకుండా హ్యాట్రిక్‌ విజయాలతో ముగించింది. తొలి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ,పాపువా న్యూ గినియా జట్లపై సునాయాస విజయాలు సాధించిన భారత్‌... 3వ గ్రూప్‌ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టును చిత్తు చేసింది. గ్రూప్‌-బీ పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన సూపర్‌ లీగ్‌ క్వార్టర్‌ఫైనల్స్‌ రౌండ్‌కు దూసుకెళ్లింది.

జింబాబ్వే జట్టు 48.1 ఓవర్లలో 154 పరుగులకే
మౌంట్‌ మాంగ్నాయుయీ బే ఓవల్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే భారీ స్కోర్‌ నమోదు చేయలేకపోయింది. భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో జింబాబ్వే జట్టు 48.1 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది.అనుకుల్‌ రాయ్‌ 4 వికెట్లు పడగొట్టి జింబాబ్వేను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా
155 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 21.4 ఓవర్లలోనే చేధించింది.ఓపెనర్లు శుభమ్‌ గిల్‌,హార్విక్‌ దెశాయ్‌ హాఫ్‌ సెంచరీలు సాధించిన భారత జట్టుకు సునాయాస విజయాన్నందించారు. 90 పరుగులతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శుభమ్‌ గిల్‌కు మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్ దక్కింది.ఈ విజయంతో భారత్‌ ఓటమంటూ లేకుండా గ్రూప్‌ దశను ముగించింది.ఈ టోర్నీలో అసలే మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు నాకౌట్‌ రౌండ్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తే....మరో సారి అండర్‌-19 వరల్డ్‌ కప్ సొంతం చేసుకోవడం ఖాయం.

Don't Miss