నేడు మూడో ట్వీ20

07:19 - October 13, 2017

హైదరాబాద్ : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న 3 మ్యాచ్‌ల ట్వంటీ ట్వంటీ సిరీస్‌లోని క్లైమాక్స్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. సిరీస్‌ నిర్ణయాత్మక సమరంలో ఇండియా-ఆస్ట్రేలియా అమీతుమీకి సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఆఖరి మ్యాచ్‌కు 20-20 ఫార్మాట్‌లో తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియాకు ...డేవిడ్‌ వార్నర్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా సవాల్‌ విసురుతోంది.3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమాన ఆధిక్యంలో నిలిచాయి.

సెకండ్‌ టీ20లో తేలిపోయిన టీం ఇండియా
తొలి టీ20లో తిరుగులేని టీమిండియా ...సెకండ్‌ టీ20లో మాత్రం తేలిపోయింది. అంచనాలకు మించి రాణించిన ఆస్ట్రేలియా జట్టు సెకండ్‌ టీ20లో టీమిండియాకు షాకిచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది. అత్యంత పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత్‌....అసలే మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని బౌలర్‌ ముందు తేలిపోయింది. కంగారూ స్పీడ్‌ గన్‌ జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ ధాటికి ధావన్‌, రోహిత్‌ , విరాట్‌ , మనీష్‌ పాండే క్యూ కట్టడంతో భారత జట్టు భారీ స్కోర్‌ చేయలేకపోయింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ విఫలమైతే టీమిండియా ఓటమి ఖాయమని రెండో టీ20తో మరోసారి రుజువైంది.

రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా
బ్యాటింగ్‌లో తేలిపోవడంతో బౌలింగ్‌లోనూ భారత్‌ ప్రభావం చూపలేకపోయింది. ఒక్క మ్యాచ్‌లో విఫలమైతేనే విరాట్ ఆర్మీ పనైపోయిందనుకుంటే పొరపాటే. ఆఖరి టీ20లో బెహ్రెన్‌డార్ఫ్‌తో పాటు ఆడమ్‌ జంపాకు చెక్‌ పెట్టగలిగితే భారత జట్టుకు విజయ అవకాశాలుంటాయనడంలో సందేహమే లేదు. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది. రెండో టీ20 విజయంతో సిరీస్‌ను సమం చేసిన ఆస్ట్రేలియా ఆఖరి మ్యాచ్‌లోనూ అంచనాలకు మించి రాణించాలని ప్లాన్‌లో ఉంది.గువహటీ టీ20లో టాస్‌ నెగ్గి, పక్కా గేమ్‌ ప్లాన్‌తోనే ..కొహ్లీ సేనకు చెక్‌ పెట్టిన డేవిడ్‌ వార్నర్‌ నాయకత్వంలోని ఆస్ట్రేలియా 3వ టీ20లోనూ సంచలనం సృష్టించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాపై టీ20ల్లో తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో పాటు...పవర్‌ఫుల్‌ టీమ్‌ కాంబినేషన్‌తో పటిష్టంగా ఉన్న ఇండియా ఆఖరి మ్యాచ్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించగలదో లేదో చూడాలి. మరి ఈ క్లైమ్యాక్స్‌ ఫైట్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ సొంతం చేసుకునే జట్టేదో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్‌ చేయాల్సిందే.

Don't Miss