నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్డే

08:45 - August 27, 2017

పల్లెకెలె : చప్పగా సాగుతున్న శ్రీలంక-భారత్‌ వన్డే సిరీస్‌... రెండో వన్డే రసవత్తరంగా మార్చింది. భారత్‌కు పోటీ లేదనుకుంటున్న తరుణంలో శ్రీలంకలో ఒక యువ స్పిన్నర్‌ ధనుంజయ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన బౌలింగ్‌ మాయాజాలంతో రెండో వన్డేలో శ్రీలంకను గెలుపు వరకు తీసుకువచ్చి... కోహ్లీ సేనకు గట్టి పోటీనిచ్చాడు. మ్యాచ్‌ ఓడిపోయినా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌... ఇవాళ శ్రీలంకతో మూడో వన్డే ఆడనుంది. ఈ వన్డే కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. అయితే.. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే శ్రీలంక చావోరేవో తేల్చుకోక తప్పదు. ఇక శ్రీలంక ఆశలన్నీ ధనుంజయపైనే ఉన్నాయి. ఇదిలావుంటే భారత్‌ బ్యాటింగ్‌లో ప్రయోగాలు చేయనుంది. ఇది శ్రీలంకకు కలిసివచ్చే అవకాశం ఉంది. రెండో వన్డేలోనూ మార్పులు చేర్పులు చేసిన టీమిండియా... ఈరోజు కేదార్‌జాదవ్‌, లోకేష్‌ రాహుల్‌లను ముందు వరుసలో బ్యాటింగ్‌కు దింపనుంది. విరాట్‌కోహ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫిట్‌నెస్‌ సాధించిన హార్దిక్‌ పాండ్యా తుదిజట్టులోకి రానున్నాడు. పల్లెకెలెలో నేడు జరగనున్న మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వన్డేలో సుమారు రెండు గంటల పాటు అంతరాయం కలిగించిన వరణుడు... మూడో వన్డేలోనూ వదిలేలా లేడు. ఈరోజు కూడా వర్షం పడే సూచనలు కనిపించడంతో.. మ్యాచ్‌ జరుగుతుందా ! లేదా అనే టెన్షన్‌ నెలకొంది. 

Don't Miss