శ్రీలంక టూర్ విజయంతో ముగించిన ఇండియా

10:26 - September 7, 2017

 

కోలంబో : శ్రీలంక పర్యటనలో టీమ్‌ ఇండియా విజయపరంపర కొనసాగింది. బుధవారం శ్రీలంకతో జరిగిన ఏకైక టీ20లో విరాట్‌సేన ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. టాస్‌ గెలిచిన టీమ్‌ ఇండియా కెప్టెన్‌ కోహ్లీ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 170 పరుగులు చేసింది.171 రన్స్‌ టార్గెట్‌తో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ రోహిత్‌శర్మ 22 పరుగుల దగ్గర, 42 రన్స్‌ దగ్గర లోకేశ్‌ రాహుల్‌ పెవిలియన్‌ బాటపట్టారు. ఈ దశలో క్రీజులో ఉన్న విరాట్‌ కోహ్లీ, మనీశ్‌పాండే మరో వికెట్‌ పడకుండా కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. లంక బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా విరాట్‌ తనదైన శైలిలో దూకుడును ప్రదర్శించి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. బౌండరీలతో చెలరేగుతూ వేగంగా హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పాండే సైతం టీ20 కెరీర్‌లో తొలి అర్థశతకం సాధించాడు. అయితే ఆఖర్లో 10 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా భారీ షాట్‌కు ప్రయత్నించి విరాట్‌ వెనుదిరిగాడు. క్రీజుల్లోకి వచ్చిన ధోనీ సాయంతో పాండే లక్ష్యాన్ని పూర్తి చేశాడు.

పోటీనిచ్చిన శ్రీలంక
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో దిల్షాన్‌ మునవీర 53 పరుగులు చేయగా... అషాన్‌ ప్రియంజన్‌ 40 రన్స్‌ చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోర్లకే ఔటైనా శ్రీలంక పరుగుల వరద పారంచింది. బ్యాట్స్‌మెన్‌ దిల్షాన్‌ మునవీర 29 బాల్స్‌లో 53 రన్స్‌ చేశాడు. 99 పరుగుల దగ్గర మునవీరను కుల్దీప్‌ యాదవ్‌ బోల్తా కొట్టించడంతో లంక రన్‌రేట్‌ పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన వారంతా తక్కువ స్కోర్‌కే అవుటయ్యారు. చివర్లో అషాన్‌ ప్రియంజన్‌ రెండు సిక్సర్లు బాది మెరవడంతో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 170 పరుగుల చేసింది. భారత బౌలర్లు చాహాల్‌కు 3వికెట్లు దక్కగా కులదీప్‌ యాదవ్‌కు 2, భువనేశ్వర్‌, బుమ్రాలకు చెరో వికెట్‌ పడింది.

Don't Miss