రైల్వేశాఖ కొత్త రకం దోపిడీ

09:32 - January 12, 2017

హైదరాబాద్ : కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయనే నానుడిని రైల్వేశాఖ నిజం చేసింది. బంధువులకు ఆహ్వానం పలికేందుకు, వీడ్కోలు తెలిపేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చేవారిని దోచుకుంటోంది రైల్వేశాఖ. పండగ సమయంలో ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ రెట్టింపు చేసి కొత్త రకం దోపిడీకి పాల్పడుతోంది. రైల్వేశాఖ తీరుపై మధ్య తరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ప్రజలను దోచుకునేందుకు సిద్ధమైన రైల్వేశాఖ  
పండుగ సీజన్‌లో ప్రజలను దోచుకునేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీజన్‌లో రద్దీ దృష్ట్యా ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ను పెంచేశారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట బంధువులను రిసీవ్‌ చేసుకునేందుకు.. మళ్లీ బంధువులు వెళ్లేటప్పుడు వీడ్కోలు చెప్పేందుకు అనేకమంది రైల్వేస్టేషన్‌కు తరలివస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకున్న రైల్వేశాఖ పండుగ సీజన్‌లో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ను అమాంతం రెట్టింపు చేసింది. గతంలో 10 రూపాయలు ఉన్న టికెట్‌ ధరను 20 రూపాయలకు పెంచింది. 
రేట్లు పెంచడం దారుణం : ప్రజలు 
రైల్వేస్టేషన్‌కు 10 మంది కుటుంబసభ్యులు వెళ్తే 200 రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో.. రేట్లు తగ్గించి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రజా రవాణ వ్యవస్థ అమాంతం రేట్లు పెంచడం దారుణమని ప్రజలంటున్నారు. రైల్వేశాఖ నిర్ణయంతో మధ్య తరగతిపై భారం పడుతుందని ప్రజలంటున్నారు. నోట్ల రద్దుతో అసలే అవస్థలు పడుతున్న ప్రజలు ఇలాంటి నిర్ణయంతో మోదీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
పాసింజర్‌ టికెట్‌ ధర రూ.5, ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ.20 
మరోవైపు దగ్గర ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు పాసింజర్‌ టికెట్‌ ఐదు రూపాయలు ఉండగా.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ 20 రూపాయలకు పెంచడం దారుణమంటున్నారు. రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణించే వారిపై దృష్టి పెట్టకుండా.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ తీసుకుని లోపలికి వచ్చేవారిని దోచుకోవడం దారుణమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలు తగ్గించేలా రైల్వేశాఖను ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. 

 

Don't Miss