నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా హవా...

ముంబై టెస్టు : నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా హవా కొనసాగుతోంది. రెట్టించిన ఉత్సాహంతో భారత బ్యాట్స్మెన్లు ఇరగదీస్తున్నారు. దీంతో అనేక రికార్డులకు ముంబై టెస్ట్ వేదికైంది. విరాట్ తన కెరీర్లో మూడో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. మూడు డబుల్ సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 631 పరుగుల
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 631 పరుగుల భారీ స్కోరు చేసి.. 231 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో ఆరుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపి విజయంవైపు దూసుకెళ్తోంది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 182 పరుగులు
నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో రూట్, బెయిర్ స్టో మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. తొలి ఓవర్లోనే తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కీటన్ జెన్నింగ్స్ డకౌటయ్యాడు. ఆ తర్వాత టీ సమయానికి ముందే కుక్, మొయిన్ అలీ కూడా ఔటవడంతో ఇంగ్లండ్ 3 వికెట్లకు 49 పరుగులతో కష్టాల్లో పడింది. నాలుగో రోజు చివరి ఓవర్లో జేటీ.బాల్‌ను ఔట్ చేసి.. ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది టీమిండియా. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్, జయంత్ చెరొక వికెట్ తీసుకున్నారు.
విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ, విజయ్, జయంత్‌లు సెంచరీలు చేయడంతో టీమిండియా.. మ్యాచ్‌ను శాసించే స్థాయికి చేరింది. తొలి సెషన్ మొత్తం విరాట్, జయంత్.. ఇంగ్లండ్ బౌలర్లతో ఆడుకున్నారు. కోహ్లీ తన కెరీర్లో మూడో డబుల్ సెంచరీ చేయగా.. జయంత్ కెరీర్లో తొలి సెంచరీ చేశాడు. అదేవిధంగా కొహ్లీ, జయంత్ యాదవ్ ఎనిమిదో వికెట్‌కు రికార్డ్ స్థాయిలో 240 పరుగులు జోడించారు. టీమిండియా తరపున ఎనిమిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ రికార్డ్. ఇంకో రెండు పరుగుల చేసి ఉంటే.. ప్రపంచ రికార్డ్ సృష్టించేవారు. అయితే.. గతంలో 1996లో అజార్, కుంబ్లే దక్షిణాఫ్రికాపై నెలకొల్పిన 161 పరుగుల భాగస్వామ్యం తెరమరుగైంది.
కెప్టెన్‌గా కొహ్లీ అరుదైన రికార్డ్
మూడు డబుల్ సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్‌గా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు కొహ్లీ. ఈ మూడు డబుల్ సెంచరీలు ఈ ఏడాదిలోనే చేయడం మరో విశేషం. క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి నిలిచాడు. అదేవిధంగా టెస్టుల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఈ ఏడాదిలోనే వెయ్యి పరుగులు చేయడం విశేషం. టెస్టుల్లో ఇంగ్లండ్‌పై తన బెస్ట్ స్కోర్‌ను నమోదు చేశాడు. ఇంతకుముందు 211 పరుగుల బెస్ట్ స్కోరును అధిగమించాడు. 340 బంతుల్లో 25 ఫోర్లు, ఒక సిక్సర్‌తో కోహ్లి 235 పరుగుల చేసి ఔటయ్యాడు. ఇక ఒక్కరోజు మాత్రమే మిగిలివుండడంతో భారత్ గెలుపు ఖాయంగా మారింది. ఇంకా 49 పరుగులు వెనకబడి ఉన్న ఇంగ్లండ్.. ఐదోరోజు నాలుగు వికెట్లను కాపాడుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.