కాలుష్య కోరల్లో భారత్!!..

16:36 - May 2, 2018

ఢిల్లీ : కాలుష్య కాసారంగా భారతదేశం మారిపోతోందా? కాలుష్య ప్రభావంతో ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారా? అంటే అవుననే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలోని పలు పట్టణాలు కాలుష్య నగరాలుగా తయారవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలుష్యానికి పలు అనారోగ్యం సమస్యలకు ప్రజలు గురవ్వటమేకాక వారి ఆయు:పరిమాణం కూడా కోల్పోతున్నారు. భారత నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవటంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం ఉన్న 15 పట్టణాల్లో 14 పట్టణాలు మన దేశానివే చెందినవే ఉన్నాయి. ఇక్కడి గాలిలో కాలుష్యం పీఎం 2.5 ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. పీఎం 2.5 అనేది అతి సూక్ష్మమైన కాలుష్య కణాలు. ఇవి గాలి ద్వారా మన ఊపరితిత్తుల్లోకి వెళ్లి తీవ్ర హాని చేస్తాయి.

భారత్ లో కాలుష్య కాసారంగా మారిన పట్టణాలు..
ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణాలు, వాటిలో పీఎం2.5 స్థాయిలను గమనిస్తే... తొలి స్థానంలో కాన్పూర్ ఉంది. ఇక్కడి గాలిలో పీఎం 2.5 అనేది 173 స్థాయిలో ఉండి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2. ఫరీదాబాద్ (172) 3. వారణాసి (151) 4. గయ (149) 5. పాట్నా (144) 6. ఢిల్లీ (143) 7. లక్నో (138) 8. ఆగ్రా (131) 9. ముజఫర్ పూర్ (120) 10. శ్రీనగర్ (113) 11. గురుగ్రామ్ (113) 12. జైపూర్ (105) 13. పాటియాలా (101) 14. జోధ్ పూర్ (98). ఇక ప్రపంచ కాలుష్య పట్టణాల జాబితాలో 15వ స్థానంలో ఉన్నది కువైట్ లోని అలి సుభా అల్ సలేమ్. ఇక్కడ పీఎం 2.5 94 స్థాయిలో ఉంది. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాలు. 14 కాలుష్య పట్టణాల్లో ఐదు యూపీ నుంచే ఉండడం గమనార్హం.

ప్రజల్లో ప్రాణాంతక వ్యాధులు..
పసి పిల్లల దగ్గర్నుంచి వృద్ధులూ చివరకు ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్నవారితో సహా దిల్లీలోని ప్రతి ఒక్కరూ తమ ప్రమేయం లేకుండా రోజుకి 44 సిగరెట్లు తాగాల్సొచ్చిందని... అదీ గాలి రూపంలో. గతనెల మొదటి వారంలో రాజధాని నగరాన్ని పొగలా కమ్మేసిన కాలుష్యం ప్రమాద హెచ్చరికల్ని దాటి ఎక్కడికో వెళ్లిపోయింది.

పర్టిక్యులేట్‌ మ్యాటర్‌
వాయు కాలుష్యాన్ని పీఎమ్‌ 2.5, పీఎమ్‌10లలో కొలుస్తారు. పీల్చే గాలిలో వెంట్రుక మందం కన్నా 25 నుంచి 100 శాతం చిన్నగా ఉండే కాలుష్య రేణువులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే సూచీ పీఎమ్‌ 2.5. దీనికన్నా కాస్త పెద్దగా ఉండేవే పీఎమ్‌10 రేణువులు. వాతావరణంలో సాధారణంగా పీఎమ్‌2.5 క్యూబిక్‌ మీటరుకు 60మైక్రోగ్రాములు ఉంటే సమస్య లేనట్లు. అది మూడువందలకు చేరితే ప్రమాద హెచ్చరికలు జారీ అయినట్లే.

ఢిల్లీలో 205గా నమోదయిన కాలుష్యం..
ఢిల్లీలో నవంబర్‌లో పీఎమ్‌ 2.5 ఏకంగా వెయ్యికి చేరిపోయింది. బర్క్‌లీ ఎర్త్‌ సైన్స్‌ పరిశోధన సంస్థ ప్రకారం ఆ గాలిని పీల్చితే రోజుకి 44 సిగరెట్లు తాగినట్లేనట. అంటే క్యాన్సర్‌ను రెండు చేతులతో ఒంట్లోకి ఆహ్వానించినట్లేగా. అందుకే, వూపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందంటూ వైద్యులు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ప్రజలు ఛాతీ నొప్పి అంటూ ఆసుపత్రులకు పరుగులు తీశారు. గాల్లో పేరుకుపోయిన దుమ్ము,ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరి వూపిరాడకుండా చేయటం..కురుస్తున్న మంచు కాలుష్య రేణువులను ఎటూ కదలనివ్వలేదు. కమ్మేసిన ఆ కాలుష్యపు పొగ రోడ్లమీద ప్రమాదాలకు దారితీస్తే ఇళ్లలో కూర్చున్నవారు సైతం కళ్ల మంటలూ దగ్గూ గొంతు మంట లాంటి అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. రైళ్లు ఆగిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి. మామూలుగానే దిల్లీలో కాలుష్యం సాధారణం కన్నా పదిరెట్లు ఎక్కువ ఉంటుంది.

గర్భిణీ స్త్రీలపై కాలుష్య ప్రభావం..
ఈ అంతులేని కాలుష్యంతో ఎంతోమంది తల్లులు నెలలు నిండని పిల్లలకు జన్మనిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఆస్థమా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్వచ్ఛతలేని రాజధాని నగర గాలిని పీల్చడం వల్ల అక్కడి పిల్లల్లో సగం మంది అంటే దాదాపు 22లక్షల మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారట. ఇక, గతనెల 40 రెట్లు పెరిగిపోయిన అక్కడి కాలుష్యం ముందుముందు ఇంకెన్ని సమస్యలకు దారితీస్తుందో.

కాలుష్యానికి కారణాలు..
మితిమీరిన వాహనాలూ గాలిని కలుషితం చేసేస్తున్నాయి. ఒకప్పుడు జనం బస్సులూ రైళ్ల సౌకర్యాలు లేవని బాధపడేవారు. ఇప్పుడున్నా ఉపయోగించుకోవడం తగ్గిపోయింది. డబ్బుండాలి కానీ ఇంట్లో నలుగురుంటే నలుగురికీ ప్రత్యేకంగా బైక్‌లూ కార్లూ గేటు ముందు ఉంటున్నాయి. దిల్లీ కాలుష్యాన్నే తీసుకుంటే దాన్లో ఇరవై శాతం వాటా వాహనాలదే. అవి విడుదలచేసే హైడ్రోకార్బన్లూ, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌డయాక్సైడ్‌... లాంటివి మనిషి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి.

పరిశ్రమల కాలుష్యం..
పరిశ్రమలూ ఇటుకల బట్టీలూ డీజిల్‌ జనరేటర్లూ రోడ్లమీద ఎగసిపడే దుమ్మూ... ఇలాంటి మరెన్నో వాయు కాలుష్యానికి ఆజ్యం పోస్తున్నాయి. నగర జనాభా పెరగడమూ పీల్చే గాలిని తీవ్రంగా కలుషితం చేస్తోంది.

Don't Miss