అల్లాడుతున్న ఇండోనేషియా ప్రజలు...

08:34 - October 1, 2018

ఇండోనేషియా :  సునామీ ఇండోనేసియాని అతలాకుతలం చేసేసింది. వెయ్యికి పైబడే ప్రాణాలను హరించేసింది. పాలూ నగరాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. సముద్ర తీరాన ఉన్న పాపానికి ఈ నగరం.. సునామీ ధాటికి తన స్వరూపాన్నే కోల్పోయింది. ఇక్కడ నివసిస్తున్న వారిని సముద్రపు అలలు.. సుమారు 20 కిలోమీటర్ల వరకూ లాక్కు వెళ్లాయంటే.. పరిస్థితి తీవ్రత ఏమేరకు ఉందో అర్థమవుతోంది. ఇప్పటి వరకూ అధికారికంగా.. 832 మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఊళ్లు మరుభూములను తలపిస్తున్నాయి.    .

సునామీ దెబ్బకు ఇండోనేసియాలో ప్రాణాలో కోల్పోయిన వారు పోగా.. ప్రాణాలతో మిగిలిన వారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. క్షతగాత్రులకు వైద్య సహాయం అందడం లేదు.. ఇక సునామీ కారణంగా సర్వం తుడిచిపెట్టుకు పోయిన ప్రజలు.. ఆహారం కోసం.. మంచినీటి కోసం అల్లాడుతున్నారు. మొన్నటిదాకా గౌరవంగా, దర్జాగా బతికిన ఇండోనేసియా వాసులు.. ఇప్పుడు ఆకలిదప్పులను తాళలేక లూటీలకు దిగుతున్నారు మరోవైపు సునామీ ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులూ విజృంభిస్తున్నాయి. దీంతో జీవచ్ఛవాల్లా మిగిలిపోయారు. ఇక భూకంపం తాకిడికి కూలిన శిథిలాలు అలాగే ఉన్నాయి. వీటిని తొలగించే ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతున్నాయి. సహాయ చర్యలకు భారీ యంత్రాలు కూడా లేకపోవడంతో ఎక్కడి శిథిలాలు అక్కడే ఉన్నాయి. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇండోనేషియా ప్రభుత్వం సునామీని జాతీయ విపత్తుగా ప్రకటించింది. 

Don't Miss