ఇండోనేషియా..400 మంది మృతి...

08:40 - September 30, 2018

ఇండోనేషియా : ప్రకృతి విపత్తులకు నిలయమైన ఇండోనేసియాను రాకాసి అలలు ముంచెత్తాయి. తీవ్రమైన భూకంపం, దాని పర్యవసానంగా వెంటనే సంభవించిన సునామీ పెను విషాదాన్ని నింపింది. సులవేసి దీవిలోని పాలూ నగరంలో  స్థానికులు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణలో తలమునకలయిన సమయంలో సునామీ ముంచెత్తింది. పాలూ నగరంలో భవనాలకు భవనాలే కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల 20 అడుగుల ఎత్తులో అలలు విరుచుకుపడ్డాయి. సునామీలో చిక్కుకొని దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  మరో 540 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడికక్కడ మృతదేహాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ విషాదం నెలకొంది.

దక్షిణ సులవేసి రాజధానిగా ఉన్న పాలూ నగరవాసుల జీవనం అస్తవ్యస్థమయింది. సముద్రం నీరు ప్రవేశిస్తుండడం, భవనాలు కూలిపోతుండడంతో దిక్కుతోచని ప్రజానీకం రోడ్లపై పరుగులు తీశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి 20 అడుగుల పొడవు ఉన్న చెట్లను కూడా ఎక్కారు. వందలాది మంది ఆచూకీ తెలియక సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. కొంతమందికి ఆరుబయటే చికిత్స చేయాల్సి వస్తోంది. ఇళ్లలోకి వెళ్లడానికి భయపడుతూ చాలా మంది బయటే తలదాచుకుంటున్నారు. అధికారులు దాదాపు 17 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఓ వ్యక్తి బురదలో కూరుకుపోయిన ఓ పసిబిడ్డ శవాన్ని వెలికితీసిన సంఘటన అక్కడి వారిని కలచివేసింది. ఓ షాపింగ్‌ మాల్‌లోని ఒక అంతస్తు భూమిలో కుంగిపోయింది. పలు చోట్ల భూమి చీలడంతో ప్రయాణించడం కష్టంగా మారింది. నగరానికి తలమానికంలా ఉండే వంతెన కూలిపోయింది. విద్యుత్తు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు నిలిచిపోవడంతో సమస్యలు అధికమయ్యాయి. మలేషియా మీదుగా వెళ్లే ఇతర దేశాల ఉపగ్రహాల సహాయంతో చిత్రాలు తీయించి వాటి ఆధారంగా సహాయ చర్యలు చేపట్టనున్నట్టు విపత్తు విభాగం ప్రకటించింది.

సునామీకి ముందు సులవేసి దీవిలో సంభవించిన భూకంపం అక్కడ తీవ్రమైన నష్టాన్ని నింపింది. భూమికి 10 కిలోమీటర్ల లోపల 7.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అనంతరం పాలూ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో దాదాపు వందసార్లు భూమి కంపించింది. ఇలాంటి చిన్న ప్రకంపనల వల్ల కూడా నష్టం అధికంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపం, సునామీ కారణంగా నష్టపోయిన మలేషియాకు భారత్‌ తరఫున సహాయం అందిస్తామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ఐరాస సమావేశాల్లో ప్రసంగిస్తూ ఆమె ఈ మేరకు ఓ  ప్రకటన చేశారు.

Don't Miss