రైతుల ప్రాణాలు తీస్తున్న పురుగుల మందు పిచికారీ

13:57 - September 10, 2017

ఆదిలాబాద్ : పంట పొలాలకు వాడే పురుగుల మందులు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. క్రిమి సంహారకాలను మితిమీరి పిచికారి చేస్తుండటంతో.. రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ముగ్గురు రైతులు మరణించడం.. సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. 

వ్యవసాయం అంటే ప్రకృతితో మమేకమై పంటను తీసి.. పది మందికి అన్నం పెట్టడం. ఇలాంటి రంగంలో సహజ సేద్యం పోయి ఎరువుల పంటలొచ్చాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా పొందేందుకు క్రిమి సంహారక మందులు, కలుపు మందులతో.. రైతులు పంటలను రక్షించుకున్నారు. కానీ ఆ మందులే వారి పాలిట యమపాశాలవుతున్నాయి. 

పెస్టిసైడ్ పిచికారి చేస్తున్న సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. చాలా మంది రైతులకు మందు పిచికారీ చేసే సమయంలో.. చేతులు కడుక్కోకుండానే తంబాకు, గుట్కా తినే అలవాటు ఉంటుంది. దీంతో అస్వస్థతకు గురై.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇలా పెస్టిసైడ్‌ కడుపులోకి వెళ్లడం వల్ల ముగ్గురు చనిపోయారు. పత్తి చేలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పెస్టిసైడ్‌ని చల్లడంతో.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట మండలం, మిట్టపల్లిలో లింగయ్య అనే రైతు పత్తి మందు చల్లే క్రమంలో.. జాగ్రత్తలు పాటించకపోవడంతో అదే రోజు రాత్రి ఇంటి దగ్గరే చనిపోయాడు. మరో రైతు పల్సి గ్రామానికి చెందిన రాములు.. పత్తి మందు కడుపులోకి వెళ్లి అన్యారోగ్యం పాలయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బజర్ హత్నూరు మండలం, గిర్నూర్‌కి చెందిన గంగయ్య పత్తి చేనుకు మందు కొట్టి.. ఇంటికి తిరిగి వస్తూ అస్వస్థతకు గురయ్యాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

స్లో పాయిజన్‌లా పని చేసే పురుగుల మందు ప్రభావంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నా ఇదీ కారణమని తెలుసుకోలేకపోతున్నారు. వీటివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శిశు మరణాలు సంభవిస్తున్నాయి. క్రిమి సంహారక మందులు రైతుల పిల్లల జీవితాల మీద కూడా ప్రభావం పడుతోంది. 

పంటకు ఏదైనా రోగం వచ్చినప్పుడు రైతులు ముందుగా సమీప వ్యవసాయాధికారులనో, వ్యవసాయ శాస్త్రవేత్తలనో సంప్రదించాలి. వాళ్లు పంటను పరిశీలించి రోగమేంటో తేల్చి మందు రాసివ్వాలి. ఏ మందు ఎంత మోతాదులో పిచికారీ చేయాలో చెప్పాలి. రైతులు మందులు పిచికారీ చేసే సమయంలో శరీరాన్నంతా ఆప్రాన్‌ లేదా కవర్‌తో కప్పేసుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అవగాహనా లోపంతో చేసే చిన్న చిన్న తప్పులతో రైతుల ప్రాణాలు పోతున్నాయి. ఇకనైనా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. 

Don't Miss