ఇరాన్‌, ఇరాక్‌ సరిహద్దులో భారీ భూకంపం

22:04 - November 13, 2017

బాగ్దాద్ : ఇరాన్‌, ఇరాక్‌ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. శక్తిమంతమైన భూకంపం ధాటికి అనేక భవనాలు కుప్పకూలాయి. ప్రకృతి ప్రకోపానికి 328 మంది మృతి చెందారు. మరో 2,500 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  

ఇరాన్‌-ఇరాక్‌ సరిహద్దుల్లో ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది.ఈ విపత్తులో ఇప్పటివరకు 328 మంది మృత్యువాత పడగా.. మరో 2,500 మందికి పైగా గాయపడ్డారు. భూకంపానికి పలు భవనాలు చిగురుటాకుల్లా వణికాయి. ఇళ్లలోని ఫ్యాన్లు ఊయలలా ఊగిపోయాయి. సూపర్‌ మార్కెట్‌లలో బల్లలపై అమర్చిన వస్తువులన్నీ భూకంప ధాటికి కిందపడిపోయాయి. 

తూర్పు ఇరాక్‌ హలబ్జా నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 33.9 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్‌లోని 20 ప్రావిన్స్‌ల్లో భారీ నష్టం సంభవించింది.  భూకంపం కారణంగా అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఒక్క సర్పోలే జహబ్‌లోనే 142 మంది చనిపోయినట్లు సమాచారం.

శిథిలాల కింద చిక్కుకుని వందల సంఖ్యలో ప్రజలు విలవిల్లాడుతున్నారు.  ప్రాణాలతో బయటపడ్డ వారు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భూకంపం తర్వాత మరో 50సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరెంట్‌, నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్‌లో హెలిక్యాప్టర్ల ద్వారా భూకంప ప్రాంతాల్లో అధికారులు సహాయకచర్యలు ముమ్మరం చేశారు. రెడ్‌క్రాస్‌ సంస్థకు చెందిన 30 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

Don't Miss