తగ్గుముఖం పట్టిన ఇర్మా

10:02 - September 12, 2017

ఫ్లోరిడా : కరీబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించిన హరికేన్‌ ఇర్మా.. ఫ్లోరిడా తీరాన్ని తాకింది. ఆదివారం ఫ్లోరిడాలోని కీస్‌ వద్ద దక్షిణ తీరాన్ని తాకిన ఇర్మా.. సోమవారం పశ్చిమ తీరానికి చేరుకోవడంతో తగ్గుముఖం పట్టి కేటగిరి 1గా మారింది. ప్రతి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ తీరంలోని మార్కో ద్వీపంలో హరికేను ప్రతాపాన్ని చూపించింది. ఈ తుపాను కారణంగా గంటకు 177 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. క్రమంగా ఇర్మా స్థాయి తగ్గుతున్నట్లు కన్పిస్తోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఫ్లోరిడాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇర్మా భయంతో ఫ్లోరిడాలో దాదాపు 60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే. ఇర్మా తుపాను ధాటికి విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. లక్షాలాది మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

భారీగా ఆస్తినష్టం...
హరికేన్‌ ఇర్మాతో ఫ్లోరిడాకు భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఫ్లోరిడా వంద బిలియన్‌ డాలర్లు నష్టపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటక రంగంపై ఇర్మా తీవ్ర ప్రభావాన్ని చూపనుందని చెబుతున్నారు. శీతాకాలంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పర్యాటక ప్రాంతాలు చాలావరకు దెబ్బతినడంతో ఈసారి పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిస్నీ వరల్డ్‌కు చెందిన మ్యాజిక్‌ కింగ్డమ్‌, యునివర్శల్‌ స్టూడియోస్‌, లెగో ల్యాండ్‌, సీ వరల్డ్‌లాంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. గత ఏడాది 113 మిలియన్ల మంది ఇక్కడ పర్యటించారు. ఇటీవల వచ్చిన హార్వే హరికేను అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టదాయకమైంది. ఈ హరికేను కారణంగా అమెరికాకు 190 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇర్మా ధాటికి కరేబియన్‌ తీరంలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు కోల్పోగా.. ఫ్లోరిడాలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. ఇర్మా పశ్చిమ దిశగా కదులుతుండటంతో చాలా వరకు ముప్పు తప్పిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు.

Don't Miss