అమెరికాపై ఇర్మా హరికేన్ ప్రతాపం

21:38 - September 10, 2017

వాషింగ్టన్ : ఇర్మా తుఫాన్‌ ధాటికి అమెరికా చివురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే కరేబియన్‌ దీవులను ముంచెత్తిన ఇర్మా.. ఇపుడు ప్లోరిడాను అతలాకుతలం చేస్తోంది. ప్రచండగాలులకు విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మియామి, ఫ్లోరిడా రాష్ట్రాల తీరప్రాంతాల్లో అంధకారం నెలకొంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఇర్మా తుపాను తీరాన్ని తాకింది. టంప్‌పట్టణ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని యూఎస్ నేష‌న‌ల్ హ‌రికేన్ సెంట‌ర్ ప్రకటించింది. తుఫాన్‌ ప్రభావం వల్ల గంటకు 209 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రచండగాలులకు లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యియి. రోడ్లపై నిలిపిన వాహనాలు సైతం కాగితాల్లా ఎగిరిపడుతున్నాయి. తుఫాను ధాటికి ఒక్క ద‌క్షిణ ఫ్లొరిడాప్రాంతంలోనే నాలుగున్నర ల‌క్షల ఇళ్లకు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.

4 కేటగిరీలుగా..
మరోవైపు ఇర్మా హరికేన్‌ ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 60లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను తుఫాను 4 కేటగిరీలుగా మారిందన్న యూఎస్ నేష‌న‌ల్ హ‌రికేన్ సెంట‌ర్ ప్రకటన ఫ్లోరిడా ప్రాంత ప్రజలను మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. తుపాను ధాటికి ఫ్లొరిడాలోని అనేక ప్రాంతాల్లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం గంట‌కు 12 కిలోమీట‌ర్ల వేగంతో ఫ్లోరిడా పశ్చిమ తీరంవైపు ఇర్మాతుఫాన్‌ కదులుతోంది. నేపెల్స్, పోర్ట్ మేయ‌ర్స్, తంపా ప్రాంతాల వైపు ఈ తుపాను దూసుకెళ్తుతున్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు.

20 వేల మంది భార‌తీయులు
మరోవైపు ఫ్లోరిడాలోని ల‌క్షా 20 వేల మంది భార‌తీయుల‌ను ర‌క్షించే చ‌ర్యల‌ను భార‌త రాయ‌బార కార్యాల‌యం చేప‌ట్టింది. తుపాను ప‌రిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 65 ల‌క్షల ఫ్లొరిడా ప్రజ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అమెరికాలోనే మూడవ అతిపెద్ద జనాభా కలిగిన ఫ్లోరిడా తీర ప్రాంతంలో తీవ్రగాలులతో ఇళ్ల పైకప్పులు, రోడ్లుపై పార్కింగ్ చేసిన వాహనాలు కదలిపోతున్నాయి. దీనికితోడు బ్రోవర్డ్ కౌంటీలో టోర్నడో చెలరేగి 15 అడుగుల ఎత్తులో గాలి సుడులు తిరుగుతూ విరుచుకుపడింది. తీరప్రాంత కెరటాలు 12 అడుగుల ఎత్తుకు విరుచుకుపడినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

Don't Miss