అక్రమ బదిలీలు

09:55 - July 21, 2017

నాగర్ కర్నూలు : రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల అక్రమ బదిలీల పరంపర కొనసాగుతోంది. బదిలీలకు అవకాశం లేదని గతంలో చెప్పిన ప్రభుత్వం... తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి జడ్ పీహెచ్ఎస్ నుంచి కొంతమంది టీచర్లను ... రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్ జడ్ పీహెచ్ఎస్ కి... వెల్దొండ జడ్ పీహెచ్ఎస్ నుంచి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ జడ్ పీహెచ్ఎస్కి బదిలీ చేస్తూ జీవో విడుదల చేసింది. ఈనెల 18వ తేదీన రంగారెడ్డి డీఈవో పేరుతో బదిలీలు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి.అయితే ఈ బదిలీలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. రెండేళ్ల నుంచి సాధారణ బదిలీల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే... నోటిఫికేషన్ విడుదల చేయని ప్రభుత్వం ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా బదిలీలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ పోతుంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు డబ్బులు దండుకుని అక్రమ బదిలీలు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అధికార పార్టీలోని కొత్త ఎంఎల్‌సీలు అక్రమ బదిలీలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. టీచర్లను బదిలీ చేయిస్తామంటూ హామీలు ఇచ్చినందున ఎన్నికైన వెంటనే పైరవీలు చేసి గుట్టుచప్పుడు కాకుండా ఈ ఉత్తర్వులు జారీ చేయిస్తున్నట్టు సమాచారం. 

Don't Miss