కందుల కొనుగోళ్లలో అక్రమాలు

12:15 - March 12, 2017

సంగారెడ్డి : రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం భావించినా.. అధికారుల తీరుతో ఆ ఆశయం నెరవేరడం లేదు. రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాల్సిన అధికారులు.. దళారులతో కుమ్మక్కై రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో రైతులు రోజుల తరబడి మార్కెట్‌యార్డులోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. 
కొత్తగా గోదాంల నిర్మాణం
ఇది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మార్కెట్‌ యార్డు. ఇది మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. నియోజకవర్గంలో కొత్తగా గోదాంలు నిర్మించిన సర్కార్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే సదుద్దేశంతో కందుల కొనుగోలు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 
రైతులకు ప్రయోజనం లేకుండాపోయిన విక్రయ కేంద్రం 
అయితే.. ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కందుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా... రైతులకు ప్రయోజనం లేకుండాపోతుంది. రైతుల వద్ద సరుకు కొనుగోలు చేయాల్సిన అధికారులు దళారులతో కుమ్మక్కై.. వారి వద్ద నుంచే సరుకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల నుంచి కందులు తీసుకొచ్చిన రైతులు మార్కెట్‌ యార్డులో రోజుల తరబడి ఉంటున్నారు. 
మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పట్టించుకోవడం లేదని వాపోతున్న రైతులు 
రోజుల తరబడి వేచి చూస్తున్నా తమకు టోకెన్లు ఇవ్వని అధికారులు.. దళారులు, వ్యాపారులకు మాత్రం వెంటనే టోకెన్లు ఇచ్చి సరుకు కొనుగోలు చేస్తున్నారని రైతులంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దళారుల వద్ద సరుకు కొంటే.. మా పరిస్థితి ఏంటని రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని కందులను కొనుగోలు చేసేలా చూడాలని కోరుతున్నారు. 

 

Don't Miss