'రైతుబంధు'తో నవ శకానికి నాంది : మంత్రి హరీష్‌రావు

07:52 - May 2, 2018

సిద్దిపేట : రైతుబంధు పథకంతో సీఎం కేసీఆర్ నవ శకానికి నాంది పలికారన్నారు మంత్రి హరీష్‌రావు. ఈ నెల 10 నుంచి రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి... అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు. 
సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు పర్యటన 
సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రతిభ డిగ్రీ కళాశాలలో క్రియేటివ్‌ టీచర్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగీష్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. అనంతరం కోటి 50లక్షలతో నిర్మించబోతున్న సమీకృత మిషన్‌ భగీరథ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 
ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి అందిస్తుందన్న మంత్రి 
రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీపై అవగాహన సదస్సులో హరీష్‌రావు పాల్గొన్నారు. రైతుబంధు పథకాన్ని అన్ని వర్గాల వారు ఘనంగా జరుపుకోవాలన్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి అందిస్తుందన్నారు. ఈ పథకాన్ని తమకు అందించాలని ఆయా ప్రభుత్వాలను రైతులు డిమాండ్ చేసే పరిస్థితి దేశవ్యాప్తంగా రాబోతోందన్నారు. ఈ రైతుబంధు పథకం దేశానికి నవశకం తీసుకురావడం ఖాయమన్నారు.  
ట్రాన్స్‌కో డివిజనల్‌ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన
బ్యాంకర్లు పాత బకాయిలు పెట్టుకోకుండా చెక్కు ఇవ్వగానే డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. పట్టాదారు పాస్ బుక్కులు, చెక్కులు పంపిణీకి ప్రతి 300 మందికి ఒక్క టీం చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ముస్తాబాద్ సబ్‌ స్టేషన్ వద్ద  కోటి రూపాయలతో నిర్మిస్తున్న ట్రాన్స్‌కో డివిజనల్‌ కార్యాలయం నిర్మాణానికి  హరీష్‌రావు శంకుస్థాపన చేశారు.     

 

Don't Miss