జమిలి ఎన్నికలు సాధ్యమా ?

16:27 - October 6, 2017

ఢిల్లీ : ఒక దేశం ఒకే పన్ను విధానం తరహాలో ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనే జమిలి ఎన్నికల నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఇందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్దం చేస్తుండగానే ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి లోక్‌ సభతో పాటు అన్నిరాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2018 సెప్టెంబర్‌ నాటికి జమిలి ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన ఇంటర్నెట్ ఆధారిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్‌వర్క్ యాప్‌ను ప్రారంభించిన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్..పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం నిధులను సమకూర్చిందన్నారు. అయితే జమిలి ఎన్నికలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందుకు తగిన చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలను సమకూర్చుకోగలమని చెప్పారు. ఇప్పటికే వీవీపీఏటీల కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కోసం రూ.12వేల కోట్లు కేంద్రం అందజేసిందని చెప్పారు.

జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు జరపడం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి ఒకే రోజున తీరాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు మన దేశానికి కొత్త కాదు. 1951-52లో తొలి సార్వత్రిక ఎన్ని కల నుంచీ 1967లో నాలుగో లోక్‌సభకు ఎన్నికల వరకూ జమిలిగానే సాగాయి. 1968,69 సంవత్సరాలలో అస్థిరత చోటు చేసుకుంది. చాలా రాష్ట్రాలలో అసెంబ్లీలు రద్దయ్యాయి. ఆ తర్వాత కేంద్రంలో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కో రాష్ర్టానికి ఒక్కో కాలపరిమితి ఏర్పడుతూ వచ్చింది. దాంతో జమిలి ఎన్నికల ప్రక్రియకు పూర్తి విఘాతం కలిగింది.

అయితే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. జమిలి ఎన్నికల విధానాన్ని 2024 నుంచి అమలుచేయాలని, రెండు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల విధానంపై విస్తృత చర్చ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. 2018 మార్చి నాటికి ఈసీ తుది నిర్ణయం ప్రకటించాలని తెలిపింది. తాజాగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి జమిలి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీ ప్రకటించింది.

మరోవైపు లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా? సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో అవి రాష్ట్ర స్థాయిలోనైనా, లేదా కేంద్ర స్థాయిలోనైనా మెజారిటీ కోల్పోయిన పక్షంలో ఏం చేయాలి? ఒకసారి ఎన్నికైన ప్రభుత్వానికి మెజారిటీతో సంబంధం లేకుండా ఐదేళ్లు పాలించే అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Don't Miss