భారతి విషయంలో జగన్ బహిరంగ లేఖ...

21:02 - August 10, 2018

విజయవాడ : ఈడీ కేసులో.. వైఎస్‌ భారతిని నిందితురాలిగా చేర్చినట్లు వచ్చిన వార్తలపై.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చార్జిషీట్‌ను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోకముందే.. ఈ విషయాలు ఎలా బయటకు వచ్చాయంటూ ప్రశ్నించారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ చేస్తోన్న కుట్ర అని జగన్‌ ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి.. వైఎస్‌ భారతిని.. ఈడీ కేసులో నిందితురాలిగా చేర్చినట్లు.. వార్తలు వచ్చాయి. దీనిపై జగన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్రజలు, ప్రజాస్వామికవాదులను ఉద్దేశించి.. బహిరంగ లేఖను విడుదల చేశారు. తనపైనే కాకుండా.. తన కుటుంబ సభ్యుల్నీ టార్గెట్‌ చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికి ఉందో.. ఇన్నేళ్ల తర్వాత చార్జిషీట్లలో భారతి పేరును చేర్చడం వెనుక కుట్ర ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు తనపై కుట్ర పన్ని.. 2011 ఆగస్టు పదోతేదీన అక్రమ కేసులు బనాయించి.. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని జగన్‌ లేఖలో ఆరోపించారు. కేసు ప్రారంభమై శుక్రవారం నాటికి పదేళ్లు గడచిపోయిన తరుణంలో.. ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి భారతి పేరును తేవడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గమనించాలని జగన్‌ కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో చంద్రబాబు మనుషులున్నారని జగన్‌ ఆరోపించారు. బాబు ఆదేశాలకు అనుగుణంగా.. ఉమాశంకర్‌గౌడ్‌, గాంధీ అనే ఇద్దరు పనిచేస్తున్నారని, వీరిపై నిరుడు ఫిబ్రవరిలో ప్రధానికి కూడా ఫిర్యాదు చేశామని జగన్‌ వెల్లడించారు. ఆ అధికారుల చేతే టీడీపీ వారు తమపై కక్షసాధింపు రిపోర్టులను రాయించారని జగన్‌ ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు పగలు కాంగ్రెస్‌తో కాపురం చేస్తూ, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు ఏపార్టీలో ఉన్నా మా మిత్రుడే అని కేంద్ర హోంమత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పడం.. చంద్రబాబు లాలూచీ రాజకీయాలకు అద్దం పడుతోందని జగన్‌ విమర్శించారు. బీజేపీతో బంధాలు, సంబంధాలు బాగున్నాయి కాబట్టే.. ఓటుకు కోట్లిస్తూ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డా.. చంద్రబాబు రొమ్ము విరుచుకు తిరుగుతున్నారని జగన్‌ ఆరోపించారు.

చంద్రబాబు.. రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని సీఎంఎస్‌, ఆమ్నెస్టీ లాంటి సంస్థలు.. నివేదించాయని జగన్‌ తన లేఖలో ప్రస్తావించారు. కేంద్రం చంద్రబాబుపై విచారణ జరపకపోవడమే ఆయన లాలూచీ వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. విపక్షాన్ని ప్రజల్లో ఎదుర్కోలేక.. చంద్రబాబు ముందుగా తన తండ్రిని.. తర్వాత తనను.. ఇప్పుడు తన భార్యను టార్గెట్‌ చేసుకున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యవహారాలను ఆమోదిస్తే.. ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుందని ప్రశ్నిస్తూ.. ఈ అంశాన్ని ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Don't Miss