నంద్యాల్లో బైపోల్ వార్

21:50 - August 12, 2017

కర్నూలు : ఉప ఎన్నిక కోసం నంద్యాల నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ నాలుగో రోజు ప్రచారం నిర్వహించారు. గోస్పాడు నుండి ప్రారంభమైన రోడ్‌షో శ్రీనివాసపురం, యాలూరు మీదుగా కొనసాగింది. ఈ రోడ్‌షోలో భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు వైఎస్‌ జగన్‌. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. ఉద్యోగాల పేరుతో యువతను కూడా చంద్రబాబు మోసం చేశారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టిన బాబు... ఒకవేళ జాబు రాకపోతే నిరుద్యోగులు 2వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. ఆఖరికి పేదవాళ్లను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదన్నారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్న చంద్రబాబు.. మూడున్నరేళ్లు గడిచినా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. ఇన్నాళ్లు నంద్యాల వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు... ఉప ఎన్నిక రాగానే మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇక్కడే మకాం వేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు.. ఇప్పుడు కూడా అది చేస్తా.. ఇది చేస్తానని హామీలు గుప్పిస్తున్నారన్నారు.ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే ఓటర్లను కొనుగోలు చేసేందుకు టీడీపీ సిద్దమవుతుందన్నారు జగన్‌. ప్రజలంతా లౌక్యంగా ఉండి... ధర్మం, న్యాయం వైపు ఓటేయ్యండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు వైసీపీ అధినేత. ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్రానికి ఈ ఎన్నికే నాంది అవుతుందన్నారు.

Don't Miss