వైఎస్ భారతికి ఏం సంబంధం - జగన్...

19:10 - August 10, 2018

విజయవాడ : ఈడీ ఛార్జీషీట్ లో భారతి పేరుందని వచ్చిన కథనాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో జగన్ సతీమణి వైఎస్ భారతిని 5వ నిందితురాలిగా పేర్కొంది. దీనిపై శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఛార్జీషీట్ ను సీబీఐ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే పత్రికల్లో వార్తలు ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో లేని అంశాలు ఇన్నేళ్ల తరువాత ఈడీ ఛార్జీషీట్ లోకి ఎందుకొచ్చాయని, వైఎస్ భారతికి ఈ కేసులతో సంబంధం ఏంటీ ? భారతిని కూడా కోర్టుల చుట్టూ తిప్పాలని కంకణం కట్టుకున్నారా ? అని ప్రశ్నించారు. తమపై కావాలనే బురద జల్లుతున్నారని ఈడీలో ఉన్న ఇద్దరు అధికారులు చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ఆరోపించారు.

జగన్ అక్రమాస్తుల కేసులో 11 ఛార్జీషీటులు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్ భారతిపై కూడా ఛార్జీషీట్ నమోదు కావడం కలకలం రేపింది. ఇటీవల మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద రఘురాం సిమెంట్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై ప్రత్యేక కోర్టు హోదా కలిగిన సీబీఐ ప్రధాన న్యాయస్థానంలో అభియోగ పత్రాన్ని ఈడీ దాఖలు చేసింది. ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. 

Don't Miss