45 ఏళ్లు దాటిన మహిళలకు రూ.75వేలు..

15:10 - September 30, 2018

విజయనగరం : ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు వాగ్ధానాల పర్వం ఏపీలో కూడా ఊపందుకుంది. మహిళా ఓటు బ్యాంకులను ఆకర్షించేందుకు నేతలు వాగ్ధానాల పరంపర కొనసాగుతోంది. గన ఎన్నికల్లో విజయం చేతివరకూ వచ్చి చేజారిపోయిన జగన్ రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో మహిళలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, మరో కీలక హామీ ఇచ్చారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి అక్కకూ రూ. 75 వేలను నాలుగు దఫాలుగా అందిస్తానని హామీ ఇచ్చారు. కోరుకొండ వద్ద తనను కలిసిన విశ్వబ్రాహ్మణులతో మాట్లాడిన ఆయన, వైఎస్ఆర్ చేయూత ద్వారా ఈ పథకాన్ని అమలు చేయిస్తానని, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళ ఏ ఇంట ఉన్నా, వారికి డబ్బు అందించేలా చర్యలు చేపడతానని అన్నారు. విశ్వబ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, బంగారం వ్యాపారంలో కార్పొరేట్లను తగ్గిస్తూ, తాళిబొట్లను కేవలం విశ్వబ్రాహ్మణులే తయారు చేసేలా చట్ట సవరణ తీసుకువస్తానని అన్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని, జీవో 272లోని అభ్యంతరకర క్లాజులను తొలగిస్తానని చెప్పారు.

 

Don't Miss