నేటితో 'జలసిరికి హారతి' ముగింపు

07:42 - September 8, 2017

అనంతపురం : ఏపీలో పండుగలా మొదలైన జలసిరికి హారతి కార్యక్రమం నేటితో ముగియనుంది. జలసిరికి హారతి ముగింపు కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇంద్రావతి నదికి సీఎం జల హారతి ఇవ్వనున్నారు. హంద్రినీవా కాలువ విస్తరణ పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. 
ఇవాళ అనంతలో పర్యటించనున్న సీఎం 
జలసిరికి హారతి ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అనంతపురం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉరవకొండలో ఇంద్రావతి నదికి సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు. దీంతో సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9.20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో ఉదయం 11 గంటలకు ఉరవకొండ చేరుకుంటారు. అక్కడి నుంచి ఇంద్రావతి నది వద్దకు వెళ్లి ఉదయం 11.15 నిమిషాలకు జలసిరికి హారతి ఇస్తారు. అనంతరం హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుని..పైలాన్‌ ఆవిష్కరిస్తారు. దాంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం ఉరవకొండ నుంచి హెలికాప్టర్‌లో పుట్టపర్తి విమానాశ్రయానికి 3.15 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమవుతారు. 
28 ప్రాజెక్టులు పూర్తిచేయాలని ప్రణాళిక 
వచ్చే ఏడాది మార్చిలోపు 13 వేల కోట్లతో 28 ప్రాజెక్టులు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జలసిరికి హారతి కార్యక్రమం ద్వారా వివిధ సాగునీటి పథకాల కింద ఆయకట్టును గరిష్ఠ స్థాయికి పెంచి పంటసిరుల సౌభాగ్యం కల్పించాలని ఆకాంక్షిస్తోంది. ఇందులోభాగంగానే సాగునీటి ప్రాజెక్టులు, నదులు, వాగులు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువులు వరకు ప్రతి సాగునీటి పథకాన్ని పూజించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 

Don't Miss