గుంటుపల్లిలోనే జలవాణి కాల్‌ సెంటర్

19:08 - May 19, 2017

అమరావతి: ఓ వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికింది ఏపీ ప్రభుత్వం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో... మౌలిక సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారు. తాజాగా రాష్ట్రంలో తాగునీటి సమస్యకు చెక్‌ పెట్టేందుకు జలవాణి పేరుతో కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు.

కాల్‌సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబునాయుడు....

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనికోసం సరికొత్త విధానాలను అవలంబిస్తోంది. ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటుంది. గ్రామాల్లో నీటి సమస్యల పరిష్కారానికి జలవాణి పేరుతో శుక్రవారం కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబునాయుడు ఈ కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో రూపొందిన రియల్‌ టైం అలెర్ట్‌ మ్యానెజ్మంట్‌ సిస్టమ్‌ ద్వారా ఈ కాల్ సెంటర్‌ పనిచేయనుంది. కాల్‌సెంటర్‌ పనివిధానాన్ని పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయనున్నారు.

గుంటుపల్లిలోనే జలవాణి కాల్‌ సెంటర్.....

గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌లోనే, జలవాణి కాల్‌ సెంటర్‌ కూడా పనిచేయనుంది. 1800-425-1899 అనే టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేస్తే... నీటి సమస్యను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ప్రతి సమస్య పరిష్కారమైనది లేనిదీ క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం...పై అధికారులకు సంబంధిత ఫొటోతో సహా నివేదించాల్సి ఉంటుంది. పైలెట్‌ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 200 వందల కాల్స్‌ వచ్చాయని వాటిని పరిష్కరించడం జరిగిందని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. సమస్య ఉందని కాల్‌ చేస్తే వెంటనే నీరు అందిస్తామని...ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన పనిలేదని మంత్రి అన్నారు. అన్ని రకాలుగా ధ్రువీకరించుకున్న తర్వాతే... పై స్థాయి అధికారులు సమస్య పరిష్కారమైనట్టు నిర్ధారిస్తారు. ఈ కాల్‌ సెంటర్ విధానం సమగ్రంగా పనిచేస్తే.. గ్రామాల్లో నీటిసమస్య చాలా వరకు తీరుతుందని నిపుణులు భావిస్తున్నారు. 

Don't Miss