శ్రీనగర్‌లో లోయలో పడిన బస్సు...

15:46 - October 6, 2018

జమ్మూకశ్మీర్‌ : మరో ఘోర ప్రమాదం...ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదు. నిండు జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా ఓ మినీ బస్సు లోయలో పడిపోవడంతో 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చాలా మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. శనివారం ఉదయం జేకే 19 1593 నెంబర్ గల మినీ బస్సు బనిహాల్ నుండి రందాన్‌కు వెళుతోంది.  కేలామోత్ వద్ద జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. సుమారు 200 మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జైంది. మొత్తంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మందికి గాయాలు కావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను లోయలో నుంచి బయటకు తీసుకొస్తున్నారు. బస్సులో అధికమంది ప్రయాణించడమే కారణమా ? లేక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ? అనేది తెలియాల్సి ఉంది. 

Don't Miss