అవినీతి ఊబిలో టిడిపి సర్కార్ - పవన్...

21:05 - June 1, 2018

విజయనగరం : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు అడ్డంగా దోచుకొంటున్నారని మండిపడ్డారు. ప్రజలు ఏ పని కోసం వెళ్లినా.. ఎంత ఇస్తావనే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు పోరాట యాత్రలో పవన్‌ కల్యాణ్‌... టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం నేతలు బాక్సైట్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వేస్తూ, గిరిజన సంస్కృతి, సంప్రదాయలను ధ్వంసం చేస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. గిరిజనుల భూములకు అందాల్సిన పెద్దగెడ్డ రిజర్వాయర్‌ నీటిని సాలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ బంజ్‌దేవ్‌ అక్రమంగా తన చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తున్నారని పవన్‌ ఆరోపించారు. బంజ్‌ దేవ్‌ చేపల చెరువుల నుంచి విడుదలవున్న కలుషిత నీటితో పంట పొలాలు పాడైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతుల గోడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టదా అని జనసేనాని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సాలూరు మొదటి ఎమ్మెల్యే కునిశెట్టి వెంకట దొర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్‌ హామీ ఇచ్చారు. 

Don't Miss